వైభవంగా లక్ష్మీనరసింహస్వామి తిరువీధి
గార: శాలిహుండం కొండ దిగువనున్న లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగింది. గిరియాత్రలో భాగంగా ముందుగా స్వామి ఉత్సవమూర్తులను శాలిహుండం, కొత్తపేట, బోరవానిపేట, తంగుళ్లపేట తదితర గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త సుగ్గు మధురెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకొని హారతులు పట్టారు. శనివారం ఉదయం వంశధార నదిలో చక్రతీర్ధ స్నానం, కొండపైన దర్శనాలు ఉండటంతో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొండవద్దకు దూరప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండపై, కిందన పాఠశాల ఆవరణలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు సిద్ధం చేశారు.
కనులపండువగా క్షీరాభిషేకం
శాలిహుండం కాళీయ మర్ధన వేణుగోపాలస్వామికి శుక్రవారం రాత్రి 12 గంటల తర్వాత భీష్మ ఏకాదశి సందర్భంగా క్షీరాభిషేకం కనుల పండువుగా జరిగింది. ఆలయ ట్రస్టీ సుగ్గు మధురెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, పూజాసామగ్రిని స్వామికి సమర్పించగా, భక్తులు తెచ్చిన పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అర్చకులు, వేదపండితులు వివిధ తీర్థ జలాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment