●కౌలు రైతుల ముసుగులో ధాన్యం కొను‘గోల్‌మాల్’
● కీలక నేత సోదరుడి అండదండలతో అక్రమాలు ● వ్యూహాత్మకంగా ఈ క్రాప్‌లో తప్పుడు వివరాలు నమోదు ● కొందరు మిల్లర్లతో కొందరు రైతు సేవా కేంద్రాల సిబ్బంది కుమ్మక్కు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
పంట లేదు.. నూర్పు లేదు.. కోత లేదు.. అసలు ధాన్యమే లేదు. కానీ ధాన్యం అమ్మిన డబ్బు లు మాత్రం ఖాతాలో పడిపోయాయి. టీడీపీ కీలక నేత సోదరుడి అండతో చేసిన మాయ ఇది. ధాన్యం కొనుగోలులో జిల్లాలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగింది. కౌలు రైతుల ముసుగులో కొందరు మిల్లర్లు దోపిడీ చేశారు. తమకు కావాల్సిన వారిని కౌలు రైతులుగా చూపించి, లేని భూములను ఈ–క్రాప్‌లోకి ఎక్కించి, వేయని పంటను పండినట్టుగా, ఆ పంటను కొనుగోలు చేసినట్టుగా.. ఆ కొనుగోలు చేసిన ధాన్యం కావల్సిన మిల్లర్లకే ట్యాగ్ చేసి అక్రమాలకు పాల్పడినట్టు సమాచారం. కొందరు రైతు సేవా కేంద్రాల సిబ్బంది, పలువురు మిల్లర్లు కుమ్మక్కై ఈ అక్రమాల పర్వాన్ని నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక కీలక నేత సోదరుడు కనుసన్న ల్లో ఈ బాగోతమంతా జరిగినట్టు తెలుస్తోంది.
వ్యూహాత్మకంగా..
ఈ క్రాప్‌లో రైతులు పేరిట ఎంత భూమిని నమో దు చేస్తే అంత భూమిలో పండిన పంటను కొనుగో లు చేయాలన్నది నిబంధన. ఒక కీలక నేత సోదరు డి డైరెక్షన్‌లో కొందరు మిల్లర్లు తెలివిగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ మిల్లర్లకు ఉండే భూములను వారి వద్ద ఉండే వ్యక్తులకు ఎకరా చొప్పున కేటాయించి, వారికి కౌలుకు ఇచ్చినట్టుగా చూపించి, ఈ–క్రాప్‌లో నమోదు చేయించారు. కౌలుకు ఇచ్చిన ఎకరా భూమితో పాటు సమీపంలోని ప్రభు త్వ భూములు, ముఖ్యంగా నోషనల్ ఖాతాలో ఉన్న భూములను కూడా వీరి పేరిట ఈ– క్రాప్‌లో నమో దు చేయించారు. అంటే ఆ మిల్లర్‌కు సంబఽంధించిన ఒక్కో కౌలు రైతుకు ఐదు నుంచి పది ఎకరాల చొప్పున నమోదు చేసినట్టు తెలిసింది. లేని భూము లు ఉన్నట్టుగా చూపించే కుతంత్రం పన్నారు. ఈ మొత్తం కుట్రలో ఆ మిల్లర్లతో కొందరు రైతు సేవా కేంద్రాల సిబ్బంది భాగస్వామ్యమై కుమ్మక్కు వ్యవ హారం నడిపారు. ఇక, కౌలు రైతులుగా నమోదు చేసిన వారంతా ఆ మిల్లరు కంట్రోల్‌లోనే ఉంటా రు. వారినే కౌలు రైతులుగా పెట్టుకున్నారు. వీరి చేతనే ఖరీఫ్‌లో జరిగిన ధాన్యం సేకరణ సమయంలో అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి.
అంతా కాగితాల్లోనే...
ఈ క్రాప్‌లో నమోదు చేసిన విస్తీర్ణంలో పంట పండిందని, వారి వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసినట్టు, ఆ కొనుగోలు చేసిన ధాన్యాన్ని తమకు కావల్సిన మిల్లుకే ట్యాగ్ చేసి, కొనుగోలు చేసిన మేరకు ఆ కౌలు రైతుల ఖాతాలకు బిల్లులు జమయ్యాక వారి దగ్గరి నుంచి తిరిగి తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి, ఆ కౌలు రైతుల పేరిట నమోదు చేసిన మేర క్షేత్రస్థాయిలో భూమి లేదు. పంట కూడా పండలేదు. కానీ అంతా కాగితాల్లో చూపించేసి, పథకం ప్రకారం అక్రమాలను కానిచ్చేశారు. ఎక్కడి ధాన్యం ఏ మిల్లుకు పంపించాలన్న ట్యాగ్ వ్యవహారం కూడా ముందస్తు వ్యూహాంతో చేసినట్టు తెలిసింది. ఫలితంగా వారు అనుకున్నట్టుగానే అక్రమ బాగోతం యథేచ్ఛగా జరిగిపోయింది. లేని పంట(ధాన్యం) ఉన్నట్టు చూపించి, బిల్లులు డ్రా చేసేసినట్టు సమాచారం.
సీఎంఆర్ కింద పీడీఎస్ రైస్
అక్కడితో గ్యాంబ్లింగ్ అయిపోలేదు. సాధారణంగా మిల్లర్లకు ట్యాగ్ చేసిన ధాన్యాన్ని ఆడించి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కింద ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ వాస్తవంగా ఆ మిల్లులకు ధాన్యమే రాలేదు. వచ్చినట్టు రికార్డుల్లో మాత్రమే చూపించి బిల్లులు కొట్టేశారు. సీఎంఆర్‌గా ఇవ్వాల్సిన బియ్యం కింద పీడీఎస్ రైస్‌ను ఇచ్చేస్తున్నట్టు కూడా తెలిసింది. బయట పీడీఎస్ రైస్ కిలో రూ. 25 నుంచి 28వరకు కొనుగోలు చేసి, దాన్నే ప్రభుత్వం నిర్దేశించిన గోడౌన్‌లకు అందజేస్తున్నట్టుగా తెలియవచ్చింది. ఇప్పటికే కొన్నిచోట్ల సీఎంఆర్ కింద పీడీఎస్ రైస్ ఇచ్చినట్టు ఓ ప్రభుత్వ సంస్థ అధికారి గుర్తించగా, ఆయనకు వార్నింగ్ వెళ్లినట్టు తెలిసింది.
విచారణ జరిపితే గుట్టురట్టు
ఈ అక్రమాల వల్లనే జిల్లాలో చాలా మంది రైతుల వద్ద పండిన ధాన్యం ఉండిపోయింది. లక్ష్యాలు పూర్తయిపోయాయని మిల్లర్లు చేతులేత్తేయడంతో ప్రభుత్వం కూడా కొనుగోళ్లను చాలా వరకు నిలిపివేసింది. ఇప్పటివరకు 4లక్షల 51వేల 10మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టుగా అధికారుల నివేదికలు చె బుతున్నాయి. ఇప్పటికే లక్ష్యం పూర్తయ్యిందని మిల్లర్లు చేతులెత్తేయడంతో కొనుగోళ్లు చేయలేకపోయామని, కొనుగోళ్ల లక్ష్యం మరింత పెంచాల ని ప్రభుత్వానికి నివేదించినట్టు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ లక్ష్యం పూర్తవ్వడం వెనక కౌలు రైతుల ముసుగులో కొంద రు మిల్లర్లు ఆడిన అవినీతి నిర్వాకమే కారణమని తెలుస్తోంది. సారవకోట, నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి తదితర మండలాల్లో ఎక్కువగా అవినీతి జరిగినట్టు తెలిసింది. ఇక్కడున్న కౌలు రైతుల పేరిట ఈ క్రాప్‌లో నమోదు చేసిన భూముల వివరాలు, పంట పండించినట్టు చూపించిన లెక్కలు, ప్రభుత్వానికి విక్రయించి, ఆ మేరకు బిల్లులు పొందిన వ్యవహా రం, ఆ కౌలు రైతుల ధాన్యాన్ని పంపించేందుకు ట్యాగ్ చేసిన మిల్లులపై లోతుగా విచారణ జరిపితే మొత్తం గుట్టు రట్టు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment