శతాబ్ది ఉత్సవం.. నూతనోత్తేజం
నల్లగొండ టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల పేరుతో ఆ పార్టీ నాయకత్వం సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు హాజరై తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపారు. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసి ఉత్సాహపరిచారు. ముందుగా సభకు తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు ఎర్ర చొక్కాలు, మహిళలు ఎర్రచీరలు ధరించి ఎర్ర జెండాలు పట్టుకుని గడియారం సెంటర్ నుంచి సభాప్రాంగణమైన ఎన్జీ కళాశాల వరకు కోలాట ప్రదర్శన, ఆటాపాటలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వందలాది మంది రెడ్‌షెర్ట్ వలంటీర్ల కవాతు, ప్రజానాట్య మండలి కళాకారుల ఆటాపాటలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీతోపాటు పట్టణంలో ఏర్పాటు చేసిన అరుణతోరణాలతో నీలగిరి పట్టణం ఎరుపెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment