గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: గోదావరి జలాలను పెంచారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు బుధవారం గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత 500 క్యూసెక్కుల నీళ్లు వదలగా గురువారం 800క్యూసెక్కులకు పెంచారు. ఈ నీటిలో 69డీబీఎంకు 250 క్యూసెక్కులు, 70 డీబీఎంకు 50, 71 డీబీఎంకు 500క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. రైతులు ఈ నీటిని వృథా చేయకుండా, కాలువలకు నష్టం కలిగించకుండా వాడుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు
ఉల్లంఘిస్తే చర్యలు
సూర్యాపేటటౌన్ : ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం హెచ్చరించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీసాయికృష్ణ ఈఎన్‌టీ, ఐఆర్‌ఏ మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లను ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లో ఫీజుల పట్టికను పరిశీలించారు. సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు.
మట్టపల్లి క్షేత్రంలో గరుడ వాహన సేవ
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీ ప్రహ్లాద యోగానంద శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు గురువారం వేదమంత్రాలతో విశేషంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేకార్చనలు చేశారు. అనంతరం నూతన పట్టు వస్త్రాలతో స్వామివారి,అమ్మవార్లను అందంగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం రక్తికట్టించారు. కల్యాణ తంతులో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, పంచగవ్యప్రాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, పద్మనాభా చార్యులు, బదరీనారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఫణి భూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
6న ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర సదస్సు
భానుపురి (సూర్యాపేట) : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 6వ తేదీన ‘విద్యుత్ బస్సులు – ప్రజలు – ఆర్టీసీలపై ప్రభావం’ అనే అంశంపై తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ తెలిపారు. గురువారం సూర్యాపేట ఆర్టీసీ డిపోలో రాష్ట్ర సదస్సు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం పర్యావరణ పరిరక్షణపేరుతో దేశంలో విద్యుత్ బస్సులను తీసుకొస్తోందని, జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు లాభం చేకూర్చేలా విధాన రూపకల్పన చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. రాంబాబు, డిపో కార్యదర్శి ఉప్పు లక్ష్మయ్య, రీజియన్ సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఇంద్ర సైదులు, శంకర్, రమణ, మల్లయ్య, వెంకన్న, ముస్తఫా, ఉపేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment