నేడు పెద్దగట్టులో దిష్టి పూజ
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్దదైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరగనుంది. ఈనేపథ్యంలో ఆదివారం దిష్టి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. దేవతామూర్తులతో ఉన్న దేవరపెట్టెను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చీకటాయపాలెం నుంచి సూర్యాపేట మండలం కేసారం శనివారం రాత్రి తీసుకొచ్చారు. ఆదివారం ఇక్కడే దేవతకు బైకానులు పూజలు చేస్తారు. అనంతరం దేవరపెట్టెను గజ్జెల లాగులు, భేరీ చప్పుళ్ల మధ్య ఓలింగా.. ఓలింగా నామస్మరణతో ఊరేగింపుగా మెంతబోయిన, తండ, మట్ట వంశీయుల సమక్షంలో 9 కిమీ దూరంలోని పెద్దగట్టుకు అర్ధరాత్రి వరకు చేరుస్తారు.
బలిహరణ
15 రోజుల తర్వాత జరగనున్న లింగమంతుల స్వామి జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను దిష్టి పూజ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజునే తల్లి పిల్ల గొర్రెను స్వామి వారికి బలిస్తారు. అనంతరం భక్తులు తీసుకుచ్చిన నైవేద్యంతో రక్తంను కలిపి గుట్ట చుట్టూ బలిహరణ కార్యక్రమం నిర్వహిస్తారు. బలిచ్చిన తల్లి పిల్ల గొర్రె మాసంతో సోమవారం ఆహారం వండి భక్తులకు వడ్డించనున్నారు. దీంతో దిష్టి పూజ కార్యక్రమం ముగిసినట్లుగా ప్రకటిస్తారు. అనంతరం సాయంత్రం దేవర పెట్టెను తిరిగి కేసారం గ్రామానికి తరలిస్తారు. జాతర ప్రారంభం రోజున మళ్లీ దేవరపెట్టెను పెద్దగట్టుకు ఊరేగింపుగా తీసుకువస్తారు.
దిష్టిపూజ కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలి
యాదవుల ఆరాధ్యదైవం శ్రీ లింగమంతుల స్వామి దిష్టిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్ కోరారు. శనివారం ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలేబోయిన నరేష్, వీరబోయిన సైదులు యాదవ్, కుర్ర సైదులు, మెంతబోయిన లింగయ్య యాదవ్, మెంతబోయిన చిన్న మల్లయ్య యాదవ్, సిరపంగి సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
భారీ పోలీస్ బందోబస్తు
పెద్దగట్టు జాతర దిష్టి పూజ నేపథ్యంలో ఎస్పీ
సన్‌ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్నుట్తు ఎస్‌ఐ వి.మహేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక డీఎస్‌పీ, ఇద్దరు సీఐలు, 11మంది ఎస్‌ఐలు, 100మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిసున్నట్లు పేర్కొన్నారు.
దేవరపెట్టెకు ఘన స్వాగతం
సూర్యాపేటటౌన్ : చీకటాయపాలెం నుంచి కేసారం గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్తున్న దేవరపెట్టకు సూర్యాపేటలో శనివారం రాత్రి పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోలెబోయిన నర్సయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం యాదవ పూజారులు డప్పు వాయిద్యాలు, భేరీల మోతలతో నృత్యాలు చేస్తూ యాత్రగా కేసారం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో యాదవ వంశస్తులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఫ కేసారం చేరిన దేవరపెట్టె
ఫ నేటి అర్ధరాత్రి వరకు లింగమంతులస్వామి ఆలయానికి.. అనంతరం గుట్టచుట్టూ బలిహరణ
ఫ 16 నుంచి 20 వరకు జాతర
పెద్దగట్టు జాతరకు రూ.5కోట్లు మంజూరు
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్దదైన శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు రూ.5కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో తాగునీరు, శాశ్వత ప్రాతిపాదికన మరుగుదొడ్లు, గుట్టపైకి దారితో పాటు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయనున్నట్తు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత జాతరల కంటే ఈ సారి నిధులు ఎక్కువగా కేటాయించినట్లు తెలిపారు. జాతర నిర్వహణ పట్ల ప్రత్యేక చొరవ చూపించి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంతి, జిల్లా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment