జాతరకు రావాలని సీఎంకు ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : ఈనెల 16వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జాతరకు రూ.5 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
రోగులకు సకాలంలో వైద్యం అందించాలి
మునగాల: రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కోటాచలం సూచించారు. శనివారం మునగాల మండలం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. తొలుత పీహెచ్‌సీలోని పలు రికార్డులు, ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఆయన వెంట పీహెచ్‌సీ వైద్యాఽధికారి డాక్టర్ వినయ్‌కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి భాస్కర్ రాజు, ల్యాబ్ టెక్నీషియన్ ఫణీందర్, శాంతయ్య పాల్గొన్నారు.
98.12శాతం
మంది హాజరు
సూర్యాపేటటౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,504 మంది విద్యార్థులకు గాను 7,363 మంది హాజరు కాగా 141 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. మొత్తం 98.12శాతం మంది విద్యార్థులు పరీక్ష రాసినట్టు చెప్పారు.
రేపు ప్రజావాణి రద్దు
భానుపురి (సూర్యాపేట) : వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరి 3న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి సోమవారం ఫిర్యాదులు సమర్పించేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడంలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తయిన తర్వాత యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
భానుపురి (సూర్యాపేట) : దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద బ్యాంక్ లింకేజీ లేకుండా నేరుగా రూ.50వేల రాయితీతో జిల్లాకు మంజూరైన 24 యూనిట్లకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు జిల్లా సంక్షేమాధికారి కె.నరసింహారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఫిబ్రవరి 12వతేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం కలెక్టరేట్‌లోని సంక్షేమ అధికారి కార్యాలయంలో పనివేళల్లో సంప్రదించాలని కోరారు.
మరింత బాధ్యతతో పనిచేయాలి
సూర్యాపేటటౌన్ : ప్రమోషన్ పొందిన వారు మరింత బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో పని చేస్తున్న ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా ప్రమోషన్ రావడంతో వారికి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్డర్ కాపీలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. క్రమశిక్షణతో ఉంటూ పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఆయన కోరారు. ప్రమోషన్ పొందిన వారిలో పి.శ్రీనివాసులు (మేళ్లచెరువు పోలీస్‌స్టేషన్), పి.మల్లయ్య (మద్దిరాల పీఎస్), జె.శ్రీనివాసు (కోదాడ రూరల్ పీఎస్), ఖయ్యూమ్ (కోదాడ ట్రాఫిక్ పీఎస్ ), నరేందర్ రెడ్డి (స్పెషల్ బ్రాంచ్ సూర్యాపేట), సీహెచ్. వెంకన్న (సీసీఎస్ సూర్యాపేట) ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నాగభూషణం, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment