కంట్రోల్ రూమ్‌లో మంత్రుల పరిశీలన
సహాయక చర్యలలో మంత్రులు
అతిభారీ వర్షాలు కొనసాగుతుండటంతో నాలుగు జిల్లాలో సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. మంత్రులు ఉదయనిధి స్టాలిన్, ఏవి వేలు, రాజకన్నప్పన్, మూర్తి, మెయ్యనాథన్, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసు తదితర మంత్రుల వరద బాధిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మీడియాతో ఉదయనిధి, తంగం తెన్నరసు, కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ మాట్లాడుతూ, వర్షాలు కొనసాగుతున్నా, లోతట్టు ప్రాంత వాసులను శిబిరాలకు తరలించే పనులు వేగంగా జరుగుతున్నట్టు వివరించారు. ఒక సీజన్ మొత్తం పడాల్సిన వర్షం ఒకే రోజులో కురిసిందని, బాధితులకు అవసరమైన సహాయకాలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రస్తుతం వరదలలో చిక్కుకుని ఉన్న వారిని రక్షించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. 200 సంవత్సరాలలో ఎన్నడూలేని వర్షాని ప్రస్తుతం ఈ జిల్లాల ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ఈ జిల్లాలో పరిస్థితిపై అధికారులతో సీఎం స్టాలిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. సహాయక చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించారు. వరద బాధిత ప్రాంతాలలోకి వెళ్లిన ఉదయ నిఽధితదితర మంత్రుల వద్ద బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
చురుగ్గా పవనాల కదలిక..
కన్యాకుమారి సముద్ర తీరంలో ఉపరితల ఆవర్తనం రూపంలో మంగళవారం కూడా దక్షిణ తమిళనాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగిస్తూ వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ హెచ్చరికలు జారీ చేశారు. కన్యాకుమారి, నెల్‌లై, తూత్తుకుడి, తెన్‌కాశిలో అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వివరించారు. అలాగే విరుదునగర్, రామనాథపురం, తేని, కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండుగల్ జిల్లాలకు సైతం పవనాలు విస్తరించాయి. ఈ జిల్లాలో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. జాలర్లు దక్షిణ తమిళనాడు, కన్యాకుమారి, మన్నార్ వలిగుడా తీరాల వైపుగా వేటకు వెళ్ల వద్దని హెచ్చరించారు. విరుదునగర్‌లో వర్షాలకు చదురగిరికి వెళ్లిన 25 మంది వాగు ఉధృతిలో చిక్కుకున్నారు. వీరిని అతి కష్టంపై రక్షించారు. తిరుప్పూర్‌లో వర్షాలకు ఉడుమలైలోని పంచలింగ మూర్తి తీర్థం, అమరలింగేశ్వరాలయాలను వరదలు చుట్టుముట్టాయి. తేని – బోడి మెట్టు మార్గంలో మట్టి చరియలు విరిగి పడుతుండడంతో వాహనాల రాక పోకలు స్తంభించాయి. ఈ వర్షాలకు విరుదునగర్ జిల్లా రాజపాళయంలో ఇల్లు కూలడంతో ఓ వృద్ధురాలు, ముదుగళత్తూరులో ఇళ్ల కూలడంతో మరో వృద్ధుడు మరణించారు. వరద బాధితులను ఆదుకునేందుకు కార్యకర్తలు , నాయకులు విస్తృత చర్యలు చేపట్టాలని డీఎంకే శ్రేణులకు స్టాలిన్, అన్నాడీఎంకే శ్రేణులకు ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి పిలుపు నిచ్చారు.
రంగంలోకి త్రివిధ దళాలు
వరద ఉధృతి తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలపై మరింత అధిక ప్రభావాన్ని చూపుతుండడంతో ఇక్కడి గ్రామాలలోని ప్రజలను రక్షించేందుకు త్రివిధ దళాలను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎస్ శివదాస్ మీన విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం వర్షాలు కొనసాగుతున్నాయని, వర్షం ఆగగానే సహాయక చర్యలు విస్తృతం చేయడానికి ఆర్మీ, నేవి, వైమానిక దళం సాయం కోరినట్లు తెలిపారు. కోయంబత్తూరు సూలూరు నుంచి హెలికాప్టర్లను రంగంలోకి దించి బాధితలుకు ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ బృందాలు, రాష్ట్ర బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
తిరునల్వేలి, తూత్తుకుడి కార్పొరేషన్లు విలవిలలాడుతున్నాయి. ఇక్కడ వరదలు మరింతగా చుట్టుముట్టి ఉన్నాయి. తిరునల్వేలి కలెక్టరేట్ నీట మునిగింది. ప్రధాన బస్‌స్టేషన్‌ను వరదలు చుట్టుముట్టడంతో బస్సులు నీట మునిగాయి. తూత్తుకుడి ప్రధాన రైల్వే జంక్షన్, కంట్రోల్ రూమ్ వరద ముంపునకు గురైంది. తిరునల్వేలి, తూత్తుకుడి ప్రధాన జంక్షన్ పరిధిలోని ప్రాంతాలలో నడుం లోతుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాలలోని ప్రజలను వందలాది బోట్ల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్ల కొరత కారణంగా డ్రమ్ములను బోట్లుగా మార్చి కొన్ని చోట్ల సహాయక చర్యలు జరుగుతోన్నాయి. సహాయక చర్యలకు ఆటంకం ఎదురయ్యే విధంగా వర్షాలు కొనసాగుతుండడంతో కలవరం పెరిగి ఉంది. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు బస చేసిన గెస్ట్ హౌస్ వరద ముంపునకు గురి కావడంతో వారిని రక్షించేందుకు సహాయక బృందాలు శ్రమించాయి. కన్యాకుమారి – మదురై జాతీయ రహదారి అనేక చోట్ల వరద ముంపునకు గురయ్యాయి. వేలాది వాహనాలు జాతీయ రహదారిలో బారులుదీరాయి. కొన్ని చోట్ల వరద ఉధృతికి వాహనాలు కొట్టుకెళ్లాయి. అనేక చోట్ల చెరువులు తెగి పోయాయి. గ్రామాల్లోకి నీళ్లు చొరబడి ఉన్నాయి. కొన్ని చోట్ల గృహాలు నేలమట్టమయ్యాయి. కూడంకులం – కన్యాకుమారి జాతీయ రహదారిని ప్రొక్‌లైనర్ల ద్వారా తవ్వేసి ఆ పరిసరాల్లోని గ్రామాలను రక్షించే విధంగా వరద ఉధృతిని మళ్లించారు. తూత్తుకుడిలో ప్రభుత్వ ఆస్పత్రి, తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోకి వరదలు చొరబడ్డాయి. తూత్తుకుడి విమానాశ్రయాన్ని వరదలు చుట్టుముట్టడంతో విమాన సేవలను రద్దు చేశారు. వరద బాధిత జిల్లాలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను రద్దు చేశారు. మంగళవారం కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల వైపుగా పలు రైళ్లు రద్దు అయ్యాయి. దక్షిణ తమిళనాడు వైపుగా జాతీయ రహదారి అనేక చోట్ల తెగడంతో చైన్నె నుంచి ఆమ్నీ ప్రైవేటు బస్సుల సేవలను రద్దు చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన 50 శాతం బస్సులను మదురై వరకు నడుపుతున్నారు. కయతారు, సేర్మాదేవి పరిసరాలలో భూ భాగం అనేది కనిపించని రీతిలో వరదలు చుట్టుముట్టి ఉండటంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మని సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment