ఈసీఆర్‌లో కలైంజ్ఞర్ అరంగం
● రూ. 525 కోట్లతో పనులకు అంచనా ● కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి కోసం దరఖాస్తు
సాక్షి, చైన్నె: చైన్నె ఈస్ట్ కోస్ట్ రోడ్డులో అంతర్జాతీయ హంగులతో కలైంజ్ఞర్ అరంగం (కన్వెన్షన్ సెంటర్) రూపుదిద్దుకోనుంది. దీనికి రూ.525 కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఈ పనుల అనుమతి కోసం కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి కోసం నివేదిక రూపంలో దరఖాస్తును ప్రభుత్వం పంపించింది. వివరాలు.. రాజధాని నగరం చైన్నెలో అతి పెద్ద ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు వేదికగా నందంబాక్కం ట్రేడ్ సెంటర్ ఉంది. ఇక్కడ వర్తక రీత్యా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం, ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, నందనం వైఎంసీఏ మైదానం వివిధ రాజకీయ పార్టీల సమావేశాలకు వేదికగా ఉంటోంది. అలాగే ప్రభుత్వ సంబంధిత చిన్న చిన్న కార్యక్రమాలకు కలైవానర్ అరంగం వేదికగా ఉంటోంది. ఈ పరిస్థితులలో చైన్నెలో అన్నింటికీ అనుకూలంగా ఉండే రీతిలో బ్రహ్మాండ వేదిక రూపకల్పనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఈసీఆర్ మార్గాన్ని ఎంపిక చేశారు. చైన్నెలో సముద్ర తీరంలో ఆహ్లాదకరంగా ఉండే ఈ మార్గంలో అంతర్జాతీయ హంగులతో బ్రహ్మాండ అరంగంకు సిద్ధమవుతున్నారు.10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఒకటి, 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా మరొకటి రూ. 525 కోట్లతో ఈ బ్రహ్మాండ ఆడిటోరియం నిర్మాణానికి నివేదిక సిద్ధం చేశారు. అలాగే,బ్రహ్మాండ ఎగ్జిబిషన్ హాల్, పది వేల వాహనాలపార్కింగ్‌కు స్థలం, ఓపెన్ ఎయిర్ స్టేడియం, పుట్‌కోట్‌లు, రెస్టారెంట్లు...ఇలా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ రంగంకు కలైంజ్ఞర్ కరుణానిధి పేరు పెట్టేందుకు ముందుగానే నిర్ణయించేశారు. కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి దక్కగానే మరికొన్ని నెలలో పనులకు శ్రీకారం చుట్టే దిశగా అధికారులు కార్యాచరణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment