సందడే.. సందడి | - | Sakshi
Sakshi News home page

సందడే.. సందడి

Published Thu, Jan 2 2025 1:54 AM | Last Updated on Thu, Jan 2 2025 1:54 AM

సందడే

సందడే.. సందడి

● రాష్ట్రవ్యాప్తంగా న్యూ ఇయర్‌ జోష్‌ ● సంబరాల్లో మునిగి తేలిన ప్రజలు ● ఆలయాలకు పోటెత్తిన భక్తులు ● వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు ● చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు

సాక్షి, చైన్నె : 2024 సంవత్సరానికి గుడ్‌ బై చెబుతూ 2025 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రాష్ట్రంలో వేడుకలు మిన్నంటాయి. అర్ధరాత్రి వేళ పరస్పర శుభాకాంక్షలతో ఆనందాన్ని పంచుకున్నారు. కేక్‌ కట్టింగ్‌లతో సందడి చేస్తూ, బాణా సంచాలను హోరెత్తించారు. బుధవారం వేకువ జాము నుంచే ప్రజలు ఆలయాల ముందు బారులు తీరారు. కొత్త ఆనందం, ఉరిమే ఉత్సాహంతో సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగాలంటూ పూజలు, దైవ ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. ఇక రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనే కాకుండా పట్టణాలు, గ్రామాల్లోనూ వేడుకలు మిన్నంటాయి. చైన్నె, శివారు జిల్లాలలోని స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, ఫామ్‌ హౌస్‌లు, క్లబ్‌లలో ఆంగ్ల సంవత్సరాదిని ఆహ్వానిస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించారు. అర్ధరాత్రి పన్నెండు కాగానే ఎక్కడికక్కడ వేడుకలలో కేక్‌లు కట్‌ చేస్తూ, బాణసంచా పేల్చుతూ, ఆట, పాటలతో కేరింతలు కొడుతూ, ఒకరికొకరు శుభాక్షాంక్షలు చెప్పుకున్నారు. యువత రోడ్లపై కేరింతలు కొడుతూ, కన్పించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇక కొత్త సంవత్సరాదిని ఆహ్వానిస్తూ జరిగిన వేడుకలలో మద్యం ఏరులై పారింది. రాష్ట్రంలోని అన్ని టాస్మాక్‌ దుకాణాలు మందుబాబులతో కిక్కిరిశాయి. బార్లు, స్టార్‌ హోటళ్లు, రిసార్ట్స్‌లలోనూ మద్యం ఏరులై పారింది.

బీచ్‌లలో..

చైన్నె మెరినాతో పాటూ రాష్ట్రంలోని అనేక బీచ్‌లు, పరిసరాలలో వేడుకలను ఆహ్వానించే కార్యక్రమాలు పెద్దఎత్తున నర్వహించారు. మెరీనా తీరంలోకి పెద్దసంఖ్యలో జన సందోహం తరలి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కామరాజర్‌ సాలై ఇసుకేస్తే రాలనంతంగా పరిస్థితి నెలకొంది. మెరీనా, ఎలియట్స్‌ బీచ్‌లలో సంబరాలు మిన్నంటే విధంగా ఉరకలు తీశారు. చైన్నె పోలీసు అధికారులు ఇక్కడ కేక్‌ కట్‌ చేశారు. పోలీసులు, ప్రజలతో కలిసి ఆనందాన్ని, శుభాకాంక్షలను పంచుకున్నారు. అందరికీ కేక్‌లు, స్వీట్లు, చాక్లెట్లను పోలీసులు పంచి పెట్టారు. అలాగే, నగరంలో పలు కూడళ్లలో పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆ పరిసర వాసులు అక్కడికి వచ్చి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే విధంగా సందడి చేశారు. నీలాంకరై, కోవలం, మహాబలిపురం బీచ్‌లలోనూ సంబరాలు మిన్నంటాయి. పుదుచ్చేరి , కన్యాకుమారి తీరాలలో కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. ఇక కన్యాకుమారి తీరంలో సూర్యోదయం కోసం పెద్దసంఖ్యలో జనం ఎదురు చూడగా.. మేఘాలు కమ్మేయడంతో నిరుత్సాహపడ్డారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అర్ధరాత్రి రాష్ట్రంలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలి వచ్చిన ఆరాధనలలో లీనమయ్యారు.కేక్‌లను కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఆలయాల్లో మిన్నంటిన భక్తిభావం

బుధవారం వేకువ జామున కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకెళ్లడంతో పాటూ, అన్ని శుభాలే జరిగేలా, తమ జీవితంలో కొత్త కాంతులు రావాలంటూ దేవుళ్లను ప్రార్థించుకునే విధంగా జన సందోహం ఆలయాల వద్ద బారులు తీరారు. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి సన్నిధిలో, జీఎన్‌ చెట్టి రోడ్డులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాలలో ఉదయాన్నే విశిష్ట పూజలు నిర్వహించారు. వేకువ జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు జరిగాయి. పెద్దఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయడంతో అందరికీ స్వామి దర్శన భాగ్యం కల్గింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ స్థానికసలహా మండలి మాజీ నిర్వాహకులు శ్రీ కృష్ణ, అనిల్‌కుమార్‌రెడ్డి, మేడగం శ్రీనివాసరెడ్డి, బి. మోహన్‌ రావు, పి. రాధాకృష్ణన్‌, రాజు కొత్తారి, శంకర్‌, ప్రతినిధులు చంద్రశేఖర్‌ , టీటీడీ స్థానిక అధికారి పార్థసారథి తదితరులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక, చైన్నె ట్రిప్లికేన్‌ పార్థసారథి ఆలయం, మైలాపూర్‌ కపాళీశ్వరాలయం, వడపళని సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు బారులుదీరి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో, తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, సమయపురం మారియమ్మన్‌ ఆలయం, తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి, పళణి దండయుధపాణి ఆలయం, తిరుప్పరకుండ్రం మురుగన్‌ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, కాంచీపురం కామాక్షి అమ్మన్‌ తదితరల ఆలయాలలో కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని వేకువ జాము నుంచి ప్రత్యేక పూజలు జరిగాయి. మదురై మీనాక్షి అమ్మ వారి ఆలయం వద్ద జైహింద్‌ పురానికి చెందిన ప్రేమ జంట కొత్త సంవత్సరం రోజున వివాహం చేసుకోవడంతో వారికి అభినందనలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్‌, ఊటీ, హొగ్నెకల్‌ వంటి పర్యాటక కేంద్రాలు సందర్శకులతో కిక్కిరిశాయి. ఇక ఆయా నగరాలలోని పార్కులు బీచ్‌ల వైపుగా జనం పోటెట్టారు. చైన్నెలోని మెరీనా, ఎలియట్స్‌, బీసెంట్‌ నగర్‌, నీలాంకరై, కోవళం, మహాబలిపురంలో జన సందడి నెలకొంది. కొత్త సంవత్సరం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. బైక్‌ రేసింగ్‌తో దూసుకెళ్లిన ద్విచక్ర వాహన దారుల భరతం పట్టే విధగా 242 వాహనాలను సీజ్‌ చేశారు. చైన్నె నగర, శివారులలో రెండు చోట్ల మాత్రం ప్రమాదాలు చోటు చేసుకోగా.. నలుగురు మరణించడం విషాదం.

రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటాయి.. అర్ధరాత్రి వేళ ఆటపాటలతో సందడి చేస్తూ.. జనం కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. వెల్‌కమ్‌ 2025 అంటూ కేరింతలు కొడుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీచ్‌లు, రిసార్ట్‌లు, హోటళ్లు, ప్రైవేట్‌ పార్టీలతో నగర వాసులు సైతం నూతనోత్సాహంతో వేడుకలు చేసుకున్నారు.

సీఎంకు శుభాకాంక్షలు..

సీఎం స్టాలిన్‌కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసం వద్దకు ఉదయాన్నేపెద్ద ఎత్తున మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు తరలి వచ్చారు. కేడర్‌ సైతం బారులుదీరింది. మంత్రులు దురై మురుగన్‌, ఏవీ వేలు, ఎం. సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, నెహ్రూ, ఎంపీలు కనిమొళి , జగద్రక్షకన్‌, టీఆర్‌బాలు తదితరులు సీఎం స్టాలిన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా కొత్త క్యాలెండర్ల ఆవిష్కరణ జరిగింది. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యాదర్శి పళని స్వామి నివాసం వద్ద సైతం ఆ పార్టీ నేతలు బారులుదీరారు. ఆయనకు శుభకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందుకున్నారు. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌ను ఆ పార్టీ నేతలు జీఆర్‌ వెంకటేష్‌ నేతృత్వంలో నిర్వాహకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సందడే.. సందడి 1
1/2

సందడే.. సందడి

సందడే.. సందడి 2
2/2

సందడే.. సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement