దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి విచారణ చేస్తున్న కలెక్టర్ కలైసెల్వి
కాంచీపురం(పళ్లిపట్టు): ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి కలెక్టర్ కలైసెల్వి మంగళవారం విచారణ చేపట్టారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఇటీవల నూతన ఓటరు జాబితా విడుదల చేశారు. దీంతో కొత్త ఓటర్లు నమోదుతోపాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆ శిబిరాల్లో పాల్గొని ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి విచారణ కోసం కలెక్టర్ కలైసెల్వి కాంచీపురంలో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు.
రూ.వెయ్యి కోసం స్నేహితుడి హత్య
అన్నానగర్: చైన్నెలోని పెరుంబాక్కంలో తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఉంది. ఇందులో కార్తీక్ (22) ఎళీల్ నగర్ 103వ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్‌లో నివాసముంటున్నాడు. అదే ప్రాంతంలో ఉంటున్న తన స్నేహితుడు రాజేష్‌కు రూ.1000 అప్పుగా ఇచ్చాడు. ఈ క్రమంలో కార్తీక్ సోమవారం రాత్రి రాజేష్‌ను చూసి తాను ఇచ్చిన 1000 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. అందుకు రాజేష్ తన దగ్గర డబ్బు లేదు అని పలికాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. ఇందులో కోపోద్రిక్తుడైన రాజేష్ ఇంట్లో ఉన్న కత్తెర తీసుకొని వచ్చి కార్తీక్ కడుపుపై పొడిచాడు. ఇందులో కార్తీక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రాజేష్, దినేష్, అతని స్నేహితుల సహాయంతో కార్తీక్‌ను ఆటోలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కార్తీక్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆటోలో కార్తీక్ మృతదేహాన్ని తీసుకుని రాజేష్ నేరుగా పెరుంబాక్కం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ ఆవేశంతో కార్తీక్‌ను కత్తెరతో పొడిచి హత్య చేసినట్లు చెప్పాడు. పోలీస్ స్టేషన్ బయట పార్క్ చేసిన ఆటోలో మృతదేహం ఉందని కూడా చెప్పాడు. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. వెంటనే కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్‌ని అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
తిరువళ్లూరు: స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సమయంలో గుమ్మిడిపూండి యువకుడు మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం సమీపంలోని తిరుకండలం మేట్టుపాళ్యం గ్రామానికి చెందిన రాజా కుమారుడు అభినేష్(20) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఈ క్రమంలో అభినేష్ తన స్నేహితుడు మురళీతో కలిసి ద్విచక్ర వాహనంలో గుమ్మిడిపూండికి బయల్దేరారు. గుమ్మిడిపూండిలోని జేఎన్‌ఎన్ కళాశాల వద్ద వెళ్తుండగా మురళీ నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్య గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అభినేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మురళీ తీవ్రంగా గాయపడగా, అతడ్ని చిక్సిత నిమిత్తం చైన్నె వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి వచ్చిన పెద్దపాళ్యం పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి తండ్రి రాజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment