ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ ఏసుప్రభు
తిరువళ్లూరు: మద్యం మత్తులో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మప్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివరాలు.. కడంబత్తూరు యూనియన్ మప్పేడు సమీపంలోని పన్నూరు గ్రామానికి చెందిన ఏసుప్రభు(37) డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి పదేళ్ల క్రితం లోకేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తల్లి రోసాలీ, తమ్ముడు స్టాలిన్‌ప్రభు తదితరులతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఏసుప్రభుకు నిత్యం మద్యం తాగే అలవాటు ఉన్న నేపథ్యంలో భార్యభర్త మధ్య ఏర్పడే చిన్నచిన్న ఘర్షణలకు సైతం ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం లోకేశ్వరి తన ఇద్దరు పిల్లలకు జ్వరం ఉండడంతో సుంగువాసత్రంలోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమైంది. అనంతరం ఇంటి వద్దకు వచ్చి తలుపులు తెరవడానికి యత్నించగా లోపల గడియ పెట్టి ఉండడంతో తెరవడం సాధ్యం కాలేదు. దీంతో పక్కింటికి చెందిన వారితో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఏసుప్రభు ఉరివేసుకుని వేలాడుతూ ఉండడాన్ని గమనించిన షాక్‌కు గురైంది. అనంతరం ఉరికి వేలాడుతున్న ఏసుప్రభును కిందకు దింపి చూడగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించి మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన మప్పేడు ఎస్‌ఐ గుణశేఖర్ కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment