భూమిపూజలో పాల్గొన్న మంత్రులు
● రూ. 14.30 కోట్లతో పనులు
సాక్షి, చైన్నె: కిలాంబాక్కం బస్ టెర్మినల్ ఆవరణలో కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. రూ. 14.30 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. కిలాంబాక్కంలో కొత్త బస్ టెర్మినల్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి దక్షిణ తమిళనాడులో పాటు పలు జిల్లాలు, నగరాలకు బస్సుల సేవలు జరుగుతున్నాయి. దీంతో దాని సమీపంలో కిలాంబాక్కం రైల్వే స్టేషన్ పనులకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేశారు. ఇందుకోసం సీఎండీఏ రూ. 20 కోట్లను కేటాయించింది. ఈ పరిస్థితుల్లో కిలాంబాక్కం పరిసరాలలో భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక పోలీసు స్టేషన్ నిర్మాణానికి సీఎండీఏ నిర్ణయించింది. ఈ పనులను ఉదయం మంత్రులు పీకే శేఖర్‌బాబు, అన్భరసన్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, కలైంజ్ఞర్ కరుణానిధి శత జయంతి స్మారకంగా కిలాంబాక్కంలో బస్ టెర్మినల్ రూపుదిద్దుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే విధంగా చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం రోజుకు 30 వేల మందికి పైగా సేవలను పొందుతున్నారని వివరించారు. ఈ బస్ టెర్మినల్‌కు కూత వేటు దూరంలో ఆమ్నీ ప్రైవేటు బస్సుల పార్కింగ్ కోసం 5 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ఇక్కడ రూ. 27.98 కోట్లతో ఆమ్నీ బస్సుల ఐడిల్ పార్కింగ్ రూపు దిద్దుకుంటున్నట్లు తెలిపారు. 120 బస్సులను పార్కింగ్ చేయడమే కాకుండా, 300 మంది డ్రైవర్ల వసతి కోసం వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూదూర ప్రాంతాలనుంచి వచ్చే ప్రయాణికులు ఎంటీసీ బస్సులను సులభంగా ఆశ్రయించే విధంగా ర్యాంప్ నిర్మాణం ఈనెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. బస్ టెర్మినల్ నుంచి జీఎస్టీ రోడ్డును దాటేందుకు వీలుగా స్కైవాక్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించామన్నారు. కార్యక్రమంలో తాంబరం పోలీసు కమిషనర్ అమల్ రాజ్, డిప్యూటీ కమిషనర్ పవన్‌కుమార్, చెంగల్పట్టు కలెక్టర్ అరుణ్ రాజ్, సీఎండీఏ సభ్య కార్యదర్శి అన్సుల్ మిశ్రా, చెంగల్పట్టు ఎమ్మెల్యే వరలక్ష్మి మధుసూదనన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment