● ప్రమాదాలకు నిలయంగా చైన్నెలో 10 రోడ్లు ● కొన్ని కూడళ్ల
మహానగరం చైన్నెలో కొన్ని మార్గాలు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. ఇందులో ముఖ్యంగా పది మార్గాలు, కొన్ని వంతెనలపై ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక కొన్ని కూడళ్లలో నిర్లక్ష్యంగా రోడ్డు దాటే వారిని మృత్యువు కబలిస్తోంది.
సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో ఏటా రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీందో ప్రమాదాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం రోడ్డు భద్రతా, అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేశారు. ఇటీవల నెల రోజులుగా జీరో యాక్సిడెంట్ డే పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించారు. అయినా ప్రమాదాలు తప్పడం లేదు. ద్విచక్ర వాహనాలలో హెల్మెట్ ధరించకుండా వెళ్లే వారు, సీట్‌బెల్ట్ ధరించకుండా కార్లను వేగంగా నడిపే వారు, నిర్లక్ష్యంగా రోడ్డుదాటే పాదచారులు అంటూ ట్రాఫిక్ నిబందనలు ఉల్లంఘించే వారు ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో క్షతగ్రాతులుగా మారి కుటుంబ సభ్యులకు క్షోభను మిగుల్చుతున్నారు. ఎక్కడెక్కడ ప్రమాదాలు మరీ ఎక్కువగా ఉన్నాయో గుర్తించి, ఆయా మార్గాల్లో ప్రమాదాల కట్టడికి చర్యలు విస్తృతంగా చేపట్టినా, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా, హెచ్చరికలు ఇస్తూ ప్రత్యేక ఏర్పాట్ల మీద దృష్టి పెట్టినా, ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.
పది మార్గాలు..
చైన్నె ట్రాఫిక్ పోలీసు పరిశీలన మేరకు మూడేళ్లలో చైన్నె నగరంలో అత్యఽధికంగా ప్రమాదాలు జరిగిన మార్గాలపై అధ్యయనం చేశారు. ఇందులో టాప్ 10లో ఉన్న మార్గాలను ఎంపిక చేశారు. వంతెన మీద నుంచి కిందకు దిగే సమయంలో, చిన్న చిన్న ఇరుకు రోడ్లలో మృత్యువు పంజా విసురుతున్నట్టు వెలుగు చూసింది. 2021 నుంచి ఈ ఏడాది జూలై 24వ తేదీ వరకు ఉన్న గణాంకాల మేరకు నగరంలో 10 మార్గాలు మృత్యు నిలయాలుగా గుర్తించారు. ఇందులో చైన్నె నగరానికి ఐకానిక్ వంతెనగా ఉన్న కత్తి పారా వంతెన తొలిస్థానంలో ఉంది. కత్తి పారా వంతెన నుంచి జీఎస్‌టీ రోడ్డులోకి వాహనాలు వచ్చే క్రమంలో అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ 223 ప్రమాదాలు జరగ్గా 177 మంది గాయపడ్డారు. 37 మంది మరణించారు. తదుపరి మదుర వాయిల్‌లో బైపాస్ రోడ్డును అనుసంధానించే ప్రదేశంలోని వంతెన మార్గం ఉంది. ఇక్కడ 143 ప్రమాదాలు జరగ్గా 105 మంది గాయపడ్డారు. 33 మంది మరణించారు. చైన్నె కోయంబేడులో కొత్తగా ఇటీవల నిర్మించిన వంతెనతో పాటు పాత వంతెన మీదుగా సైతం ప్రమాదాలు అధికంగానే ఉన్నాయి. ఇక్కడ 104 ప్రమాదాలు, గిండి నుంచి ప్యారీస్ వరకు ఉన్న సుమారు 14 కి.మీ దూరం ఉన్న అన్నాసాలైలలోనూ ప్రమాదాలు ఎక్కువే. ఇక్కడ 190 ప్రమాదాలు జరగ్గా 151 మంది గాయపడ్డారు. 26 మంది మృత్యువొడిలోకి చేరారు. అలాగే చైన్నె మెరీనా తీరంలోని నేప్పియర్ వంతెన మార్గం కూడా మృత్యుకుహరంగా మారింది. ఇక్కడ 155 ప్రమాదాలు జరగ్గా 107 మంది గాయాల పాలయ్యారు. 26 మంది మరణించారు. వానగరంలో 147 ప్రమాదాలలో 106 మంది గాయాలయ్యారు. 35 మంది మృతి చెందారు. ఈ పది మార్గాలు ప్రస్తుతం చైన్నెలో ప్రమాదాలకు నిలయాలుగా మారి ఉండటంతో కట్టడి దిశగా విస్తృత చర్యలకు చైన్నె పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అలాగే చైన్నె నగరంలో కొన్ని కూడళ్లలో నిర్లక్ష్యంగా రోడ్లు దాటడం, సిగ్నల్స్‌ను అనుసరించక పోవడం వంటి కారణాలతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్టు గుర్తించారు. సబ్ వేలను, పుట్ ఓవర్ బ్రిడ్జిలలో వెళ్లకుండా రోడ్డును నిర్లక్ష్యంగా దాటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్న వాళ్లు ఎక్కవగా ఉన్నారు. ఇందులో చైన్నె మెట్రో, బ్రాడ్ వే బస్టాండ్, నెహ్రు పార్కు మెట్రో స్టేషన్‌లలో నిత్యం ప్రమాదాలు జరగడమే కాకుండా ఈ ప్రాంతాలలో 50 మంది మృత్యువాత పడటం గమనార్హం.
కత్తి పారా వంతెన
వంతెనల రూపంలో..
చైన్నె నగరం, శివారు ప్రాంతాలు అభివృద్ధి పథంగా దూసుకెళ్తున్నాయి. దీంతో వాహనాల రద్దీ పెరిగింది. రద్దీని కట్టడి చేయడం కోసం చైన్నె వ్యాప్తంగా వంతెనల నిర్మాణం వేగం పుంజుకుంది. అలాగే మెట్రో రైలు సేవల కార ణంగా అనేక మార్గాలు వన్ వేలుగా మారా యి. మరికొన్ని మార్గాలు ఇరుకు రోడ్లుగా మారాయి. ఈ ప్రాంతాలో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువే. అదే సమయంలో వాహన దారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. వంతెన మార్గాలలో అ యితే, అతి వేగంగా దూసుకెళ్లి, లింక్‌రోడ్డులలోకి ప్రవేశించే క్రమంలో ప్రమాదాల బారిన పడే వారు మరీ ఎక్కువగా ఉన్నట్టు చైన్నె ట్రాఫిక్ పోలీసుల పరిశీలనలో వెలుగు చూ సింది. నగరంలో అనేక వంతెనలు ప్రస్తుతం మృత్యు మార్గాలుగా మారి ఉన్నాయి. వంతెనల మీద నుంచి అతి వేగంగా వచ్చే ద్విచక్ర వాహన దారులు అదుపు తప్పి ప్రమాదానికి గురై మృత్యువాత పడటం లేదా క్షతగాత్రులుగా ఆస్పత్రిలో చేరడం క్రమంగా పెరుగుతోంది. ఈ వంతెన మార్గాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉండటంతో వాహనాల వేగాన్ని కట్టడి చేయడం కష్టతరంగా మారింది. ఈ వంతెనలలో నిర్ణీత స్పీడ్‌లోనే వాహనాలను నడపాలన్న ఆదేశాలు, బోర్డులు ఉన్నా, అనుసరించే వారు కరువయ్యారు. దీంతో ప్రమాదాలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment