మహిళా మోర్చా న్యాయ యాత్ర
● అడ్డుకున్న పోలీసులు ● కుష్బూ సహా మహిళా నాయకుల అరెస్ట్ ● పలుచోట్ల వినూత్నంగా నిరసనల హోరు ● ఆ సారెవరో..?
సాక్షి, చైన్నె : అన్నావర్సిటీ ఘటనకు నిరసనగా మదురై టూ చైన్నె న్యాయ యాత్రను శుక్రవారం ఉదయం బీజేపీ మహిళా మోర్చా నాయకులు నిర్వహించారు. ఆ యాత్రను మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. మహిళా నేతలను అరెస్టు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ విభాగం నేతృత్వంలో పలుచోట్ల వినూత్న రీతిలో నిరసనలు హోరెత్తాయి. అన్నావర్సిటీ లైంగిక దాడి ఘటనలో బాధితురాలికి న్యాయం కల్పించాలన్న నినాదంతో రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ మహిళా మోర్చా నేతృత్వంలో న్యాయ యాత్ర పేరిట మదురై నుంచి చైన్నెకు ర్యాలీ ఏర్పాట్లు చేశారు. చైన్నెకు చేరుకున్న తర్వాత గవర్నర్ ఆర్‌ఎన్ రవిని కలిసే విధంగా నిర్ణయించారు. ఆ మేరకు ఉదయం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, నటి కుష్బూ, బీజేపీ ఎమ్మెల్యే సరస్వతి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఉమ పాటు మూడు వందల మంది మహిళలు మదురై చెల్లాతమ్మన్ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడి నుంచి న్యాయయాత్రను ప్రారంభించారు. ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చినా మహిళా మోర్చా వర్గాలు ఏ మాత్రం తగ్గలేదు. తమ నిరసనను కొనసాగించే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మార్గమధ్యంలో అందరినీ బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. మదురైలోని సిమ్మక్కల్ ప్రాంతంలోని ఓ కల్యాణ మండపంలో సాయంత్రం వరకు ఉంచారు. అయితే, మేకలదొడ్డి పక్కనే ఉన్న కల్యాణ మండపంలో దుర్వాసనల మధ్య పోలీసులు ఉంచారని బీజేపీ మహిళా నేతలు పేర్కొంటున్నారు. ఈ అరెస్టును బీజేపీ నాయకులు ఖండించారు. అదే సమయంలో మహిళా మోర్చా నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆలయాల వద్ద వినూత్న రీతిలో నిప్పు కుండలను చేతబట్టి న్యాయం కోసం నినదించారు. అలాగే, కొన్ని చోట్ల మదురైను ఆనాడు కన్నగి ఏ విధంగా దహనం చేసిందో మరో మారు చాటే విధంగా కళ్లకుకట్టినట్టుగా కొందరు వేషధారణలతో డీఎంకే పాలకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరెన్నో చోట్ల బీజేపీ మహిళా మోర్చా నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. మహిళా నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధంలో ఉంచడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు.
ఆ సారు ఎవరో?
మీడియాతో కుష్బూ మాట్లాడుతూ, న్యాయం కోసం తాము శాంతియుతంగా యాత్ర చేస్తే అడ్డుకుని అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతి పెట్టేశారని, సర్వాధికార పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే వారిని బలవంతంగా అరెస్టు చేయిస్తున్నారని, ప్రశ్నిస్తే గళాన్ని నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లైంగిక దాడి కేసులో పోలీసులు చెబుతున్న కట్టు కథలను నమ్మే స్థితిలో లేమన్నారు. పాలకుల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు పనిచేస్తున్నారని, వారు పడుతున్న సతమతం చూస్తే జాలి వేస్తుందన్నారు. మహిళా మోర్చా నేతృత్వంలోని నిరసనకు మహిళల నుంచి మద్దతు పెద్ద ఎత్తున రావడంతో పాలకులు షాక్ గురై తమను అడ్డుకున్నారని విమర్శించారు. బీజేపీ మహిళా బలం ఏమిటో తాజాగా డీఎంకే పాలకులకు తెలిసి వచ్చినట్టుందని, మున్ముందు ఎవ్వరూ ఊహించని రీతిలో మహిళల మద్దతుతో సర్వాధికార పాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. ఈకేసులో ఆ సారు ఎవరో అనేది వెలుగులోకి వచ్చే వరకు వదలి పెట్టమన్నారు. ఇదిలాఉండగా, అన్నావర్సిటీ కేసు విచారిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారిణులతో కూడిన సిట్ బృందం బాధితురాలి వద్ద గంట పాటు విచారించింది. అలాగే, పట్టుబడ్డ నిందితుడు జ్ఞానశేఖర్ సెల్‌ఫోన్‌కు సంబంధించిన ఆరునెలల డేటాను సేకరించి సమగ్ర పరిశీలన జరుపుతున్నారు. ఆ సారు ఎవరో అనే కోణంలో ఈపరిశీలన జరుగుతున్నటు సమాచారం. అదే సమయంలో నిందితుడు లైంగికదాడికి పాల్పడిన సమయంలో ఎవరో సారుతో ఫోన్లో మాట్లాడినట్టుగా వెలువడ్డ సమాచారంతో ఆ సారు ఎవరో అనే పోస్టర్లు రాష్ట్రవ్యాప్తగా హోరెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాలలోనూ ఆ సారు ఎవరో అనే చర్చ ఊపందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment