విలీనానికి వ్యతిరేకంగా నిరసన
● గ్రామ మహిళల రాస్తారోకో ● మూడు గంటలపాటు ట్రాఫిక్
పళ్లిపట్టు: పట్టణ పంచాయతీలో విలీనానికి గ్రామ మహిళలు రాస్తారోకో చేపట్టారు. దీంతో పళ్లిపట్టు షోళింగర్ రోడ్డు మార్గంలో మూడు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో పాలన సులభతరం కోసం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, టౌన్ పంచాయతీల్లో గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ గతవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఇందులో పళ్లిపట్టు టౌన్ పంచాయతీలో రామచంద్రాపురం పంచాయతీని విలీనం చేశారు. గ్రామాన్ని టౌన్ పంచాయతీలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామానికి చెందిన 200 మంది మహిళలు సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదురుగా షోళింగర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. వెంటనే తిరుత్తణి డీఎస్పీ కందన్, తహసీల్దారు శివకుమార్, బీడీఓ అర్పుదరాజ్ తదితరులు సంఘటన ప్రాంతం చేరుకుని మహిళలతో మాట్లాడారు. పట్టణ పంచాయతీలో తమ గ్రామాన్ని విలీనం చేయడం ద్వారా ఉపాధి పనులు కోల్పోవాల్సి వస్తుందని, పన్నుల భారం పెరిగి వ్యవసాయ భూములు తగ్గి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులకు మహిళలు తెలిపారు. దీంతో గ్రామీణుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment