నామినేషన్లు సమాప్తం!
● 21 మంది దాఖలు ● నేడు పరిశీలన ● రంగంలోకి పర్యవేక్షకులు ● మద్దతు లేదన్న విజయ్
సాక్షి, చైన్నె : ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. శనివారం పరిశీలన జరగనుంది. డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి సీతాలక్ష్మి సహా 21 మంది నామినేషన్లు సమర్పించారు.
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోడ్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్ వారసుడు తిరుమగన్ ఈవేరా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. 2023లో ఆయన గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నికలు తప్పలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి కావడంతో కాంగ్రెస్ అధిష్టానంతో పట్టుబట్టి మరీ ఈవీకేఎస్‌ను అభ్యర్థిగా డీఎంకే నిలబెట్టింది. ఆయన్ను డీఎంకే కూటమి 60వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంది. అయితే, గత ఏడాది ఈవీకేఎస్ కూడా కన్నుమూశారు. దీంతో మళ్లీ ఈ స్థా నానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈనెల 10వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ ఎ న్నికల్లో సీటును కాంగ్రెస్‌కు ఇవ్వకుండా తన అభ్యర్థిని డీఎంకే పోటీలో పెట్టింది. ఆ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే చంద్రకుమార్ పోటీలో దిగారు. ఈ ఎన్నికలను అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకేలు బహిష్కరించాయి. వీరి బాటలో తమిళగ వెట్రి కళగం నేత విజయ్ కూడా శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. తమ లక్ష్యం 2026 ఎన్నికలు అని, ఉపఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని, ఎవ్వరికీ మద్దతు ఇవ్వడంలేదని ప్రకటించారు.
21 మంది నామినేషన్లు దాఖలు
ఈసారి పండుగ సెలవులు అధికంగా రావడంతో ఈనెల 10,13 తేదీల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరించారు. ఈ రెండు రోజుల్లో కేవలం తొమ్మిది నామినేషన్లు వచ్చాయి. చివరి రోజైన శుక్రవారం మరో 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉదయం ఈవీకేఎస్ చిన్న కుమారుడు సంజయ్‌సంపత్‌తో కలిసి డీఎంకే అభ్యర్థి చంద్రకుమార్ తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి మనీష్‌కు అందజేశారు. అలాగే, నామ్‌తమిళర్ కట్చి అభ్యర్థి సీతాలక్ష్మి సైతం నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, అవినీతికి వ్యతిరేక నినాదంతో ఆల్ ఇండియా యాంటీ కరప్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు అగ్ని ఆళ్వార్ నోట్ల దండను ధరించి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అలాగే, మదురైకు చెందిన మాజీ సైనికుడు వినాయగం సైనిక దుస్తులతో వచ్చి నామినేషన్ సమర్పించారు. మొత్తంగా 21 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటి పరిశీలన శనివారం జరగనుంది. 19వ తేదీ ఆదివారం కావడంతో 20న ఉపసంహరణ ప్రక్రియ తర్వాత తుది జాబితాను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ ఎన్నికలు, 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులుగా అజయ్‌కుమార్ గుప్తా, సంతాన దీప్తి, దినేష్‌కుమార్‌లను నియమించారు. వీరు ఈరోడ్‌కు చేరుకున్నారు. వీరికి కలెక్టర్ రాజగోపాల్ సుంకర ఆహ్వానం పలికారు. ఎన్నికల విధులు, ఏర్పాట్లకు సంబంధించి సమావేశమయ్యారు. నగదు బట్వాడా కట్టడి దిశగా మూడు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, మూడు సిట్టింగ్ బృందాలను రంగంలోకి దించారు. ఇప్పటివరకు రూ.12 లక్షలు నగదు సీజ్ చేయగా, తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించిన వారికి రూ.3.30 లక్షలు వెనక్కి అప్పగించారు. నియోజకవర్గంలో నిఘాను కట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాలను అనేక కూడళ్లలో ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇక, అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నామ్ తమిళర్ కట్చికి చెందిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment