సంక్రాంతికి రూ.2 వేలు పిటిషన్ తిరస్కృతి
సాక్షి, చైన్నె: సంక్రాంతి సందర్భంగా కుటుంబ రేషన్ కార్డుదారులకు రూ.2 వేలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ప్రతిఏటా సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం కానుకను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. బియ్యం, చక్కెర, చెరకు వంటి వస్తులతోపాటు నగదు రూ.1000 అందజేసేవారు. అయితే, ఈసారి ఆర్థిక భారం నేపథ్యంలో రూ.1000 నగదు ఇవ్వలేదు. అదేసమయంలో ప్రజలకు రూ.2 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీజేపీ న్యాయవాది ఏర్కాడు మోహన్‌దాసు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం జరిగింది. సంక్రాంతి ముగిసిన నేపథ్యంలో రూ.2 వేల నగదు పంపిణీ ప్రభుత్వ సిద్ధాంతపరమైన విషయం కావడంతో, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తులు స్పష్టంచేస్తూ, పిటిషన్ విచారణను తిరస్కరించారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కానుం పొంగల్ సందర్భంగా చైన్నె మెరీనాబీచ్‌కు గురువారం 2లక్షల మంది జనం వచ్చినట్టు పరిశీలనలో తేలింది. 19 మంది పిల్లలు తప్పిపోగా వారిని రక్షించి సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు పోలీసులు చేర్చారు. అలాగే, మెరీనా తీరంలో రాత్రంతా శ్రమించి 5 టన్నుల చెత్తను పారిశుధ్య కార్మికులు తొలగించారు. ఇక, చైన్నెలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న చైన్నె సంగమం వేడుకలను 3 లక్షల మంది వీక్షించినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే, పర్యాటకశాఖ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను 90 వేల మంది తిలకించారు. పండగ కోసం స్వస్థలాలకు వెళ్లిన వారంతా చైన్నె వైపు తిరుగుపయనం అయ్యారు. దీంతో పరనూరు టోల్‌గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి.
కలైంజ్ఞర్ అరంగంకు పర్యావరణ అనుమతి
● కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ కోసం ఎదురుచూపు
సాక్షి, చైన్నె: చైన్నె ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో అంతర్జాతీయ హంగులతో కలైంజ్ఞర్ అరంగం(కన్వెన్షన్ సెంటర్) ఏర్పాటుకు పర్యావరణ అనుమతి దక్కింది. అదే సమయంలో కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చైన్నెలో సముద్రతీరంలో ఆహ్లాదకరంగా ఉండే ఈసీఆర్ మార్గంలో అంతర్జాతీయ హంగులతో బ్రహ్మాండమైన అరంగం నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. 10 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఒకటి, 5 వేల మంది కూర్చునేందుకు వీలుగా మరొకటి రూ. 525 కోట్లతో ఈ ఆడిటోరియం నిర్మాణానికి నివేదిక సిద్ధం చేశారు. భారీ ఎగ్జిబిషన్ హాల్, పది వేల వాహనాల పార్కింగ్‌కు స్థలం, ఓపెన్ ఎయిర్ స్టేడియం, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు...ఇలా అన్ని రకాల హంగులతో రూపుదిద్దుకోనున్న ఈ ఆడిటోరియంకు కలైంజ్ఞర్ కరుణానిధి పేరు పెట్టేందుకు ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. ఈ పనులకు పర్యావరణ అనుమతి దక్కింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం వెలువడ్డాయి. ఇక కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతి దక్కగానే ఫిబ్రవరిలో పనులు మొదలెట్టే దిశగా అధికారులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు.
బస్సు బోల్తా :
ఆరుగురికి గాయాలు
వేలూరు: ప్రభుత్వ బస్సు బోల్తాపడి ఆరుగురికి గాయాలయ్యాయి. చైన్నె నుంచి తిరుపత్తూకు వెళుతున్న ప్రభుత్వ బస్సు జోలార్‌పేట సమీపంలో చిన్నమోటూరు వద్ద వెళుతుండగా అదుపు తప్పి బస్సు రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటేశ్‌రాజ్, కండక్టర్ మూర్తి, గుడియాత్తంకు చెందిన ప్రయాణికుడు వినోద్, సేట్టు, పుహలేంది సహా ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే అంబులెన్స్‌ను రప్పించి గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి జోలార్‌పేట పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని బస్సులో చిక్కుకున్న మరి కొందరిని బస్సు ముందు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాదం గురించి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment