తామర భరణిలో ఇద్దరు పిల్లల గల్లంతు
–ఒకరి మృతదేహం లభ్యం
సాక్షి, చైన్నె: తామర భరణి నదిలో ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం బయటపడింది. తూత్తుకుడికి చెందిన నాగార్జున, అయ్యప్పన్ కుటుంబసభ్యులు 15 మంది ముక్కడల్ గ్రామంలోని స్నేహితుడి ఇంటికి సంక్రాంతి వేడుకల నిమిత్తం వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం అందరూ ముత్తుమారియమ్మన్ ఆలయం వద్ద ప్రవహిస్తున్న తామర భరణి నది వద్దకు వెళ్లారు. ఐదుగురు నీళ్లలో దిగిన స్నానానికి ప్రయత్నించారు. ఈ సమయంలో హఠాత్తుగా వారు నీళ్లలో కొట్టుకెళ్తుండడాన్ని గుర్తించిన స్థానికులు అతికష్టం మీద ముగ్గురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు నాగార్జున కుమార్తె వైష్ణవి కాగా, మరొకరు అయ్యప్పన్ కుమార్తె మారి అనసూయ ఉన్నారు. ఇందులో ఒకరి మృతదేహం సాయంత్రం బయటపడింది.
సీబీసీఐడీ సమాధానం చెప్పాలి
కొరుక్కుపేట: కళ్లకురిచ్చి వ్యవహారంలో అరెస్టయిన వారి సరైన వివరాలు ఇవ్వాలని సీబీసీఐడీని కోర్టు ఆదేశించింది. కళ్లకురిచ్చిలో గతేడాది జూన్‌లో కల్తీ మద్యం తాగి 60 మంది చనిపోయారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్టు అయిన చిన్నదురై, షాకుల్ హమీద్ ఇద్దరూ బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ ముందు విచారణకు రాగా, ఇద్దరికీ జైలు శిక్ష విధిస్తూ గూండా చట్టం కింద జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని మద్రాసు హైకోర్టును కోరారు. విచారణకు సహకరించేందుకు పిటిషనర్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. దీనిపై న్యాయమూర్తి ఈనెల 23వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని సీబీసీఐడీ పోలీసులను కోరుతూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment