● ఇద్దరిని పెట్రోల్ పోసి తగలెట్టేశారు.. ● కంచి సమీపంలో ఉద్రిక్తత
సాక్షి, చైన్నె: కాంచీపురం సమీపంలోని వాలాజా బాద్‌కు చెందిన ముగ్గురు ప్లస్‌టూ విద్యార్థులు ఓ చెరువులో కాలిన స్థితిలో మృతదేహాలుగా రెండురోజుల క్రితం బయట పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే కాంచీపురం సమీపంలో మరో ఘటన చోటుచేసుకుంది. క్రికెట్ గొడవలో ఇద్దరు యువకులపై పెట్రోల్ పోసి ప్రత్యర్థులు తగలబెట్టడం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంచీపురం సమీపంలోని రాణిపేట జిల్లా పరిధిలోని నెమ్మెలి నెల్వాయి గ్రామానికి చెందిన తమిళరసన్ అలియాస్ సూర్య(23), విజయగణపతి(23) తమ మిత్రులతో కలిసి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో గురువారం సాయంత్రం క్రికెట్ ఆడారు. ఈ సమయంలో తిరుమాల్ పూర్‌కు చెందిన ప్రేమ్(22)తో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన ప్రేమ్ తన మిత్రులు ఐదుగురితో వచ్చి సూర్య, విజయ గణపతిలపై పెట్రోల్ పోసి తగల బెట్టేశారు. మంటల్లో కాలుతున్న ఆ ఇద్దర్ని ఆ పరిసరవాసులు రక్షించే ప్రయత్నం చేశారు.
తీవ్రంగా గాయపడ్డ వారిని కాంచీపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అర్ధరాత్రి వేళ చైన్నె కీల్పాకంకు తరలించారు. శుక్రవారం వైద్యులు ఆ ఇద్దరిని పరీక్షించి తీవ్రచికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నెల్వాయి గ్రామప్రజలలో ఆగ్రహం రేగింది. తిరుమాల్‌పూర్ మార్గంలో ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రాణిపేట ఎస్పీ వివేకానంద శుక్లా, అరక్కోణం ఇన్‌స్పెక్టర్ పళణివేల్, గురునాథన్ ఆందోళనకారులను చర్చలు జరిపారు. దర్యాప్తు వేగాన్ని పెంచి ప్రేమ్‌ను అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment