వారంలో తుది విచారణ
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై వారం రోజుల్లో తుది విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. సీఎం ఎంకే స్టాలిన్, రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి మధ్య జరుగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గవర్నర్ రవిౖపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. అసెంబ్లీ ఆమోదించిన అనేక ముసాయిదాలను గవర్నర్ రవి పెండింగ్‌లో పెట్టడం, చైన్నె విశ్వవిద్యాలయం, తమిళనాడు డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, తమిళనాడు ఎంజీఆర్ వర్సిటీ, వ్యవసాయ వర్సిటీ, వెటర్నరీ వర్సిటీ, అన్నై థెరిసా వర్సిటీ, మత్స్య వర్సిటీ, అన్నావర్సిటీ, సిద్ధ వైద్య వర్సిటీ చట్ట సవరణల ముసాయిదాలు, వైస్ చాన్స్‌లర్ల నియామకం, ఇతర అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత కొంత కాలంగా ఈ పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి. శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా న్యాయమూర్తులు వారం రోజులలో తుది విచారణ అని ఈసందర్భంగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వంవిశ్వవిద్యాలయాలయ వైస్ చాన్స్‌లర్ల నియామకం వ్యవహారంలో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై కొత్తగా నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తూ, వారం రోజులలో ఈ కేసుకు సంబంధించి తుది విచారణ జరుగుతుందని న్యాయ మూర్తులు ప్రకటించారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment