జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై కూతురు తూల్జ భవానీరెడ్డి పోరాటం సాగిస్తోంది. తన సంతకం ఫోర్జరీ చేసి హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న భూమి లీజ్ అగ్రిమెంట్ మార్చారని కేసు పెట్టిన కూతురు.. తాజాగా చేర్యాల భూమి విషయంలో నిలదీశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం సందర్బంగా జనగామలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
అక్కడికి కూతురు తుల్జా భవానీ రెడ్డి చేరుకుని తండ్రి చేతికి డాక్యుమెంట్ ఇచ్చి.. మీడియా ఎదుటే దానిపై ఉన్న సంతకాల గురించి ప్రశ్నించారు. ఇందుకు ఆయన బదులిస్తూ.. నీదే కదా! అంటూ సమాధానం ఇచ్చారు. ఆ సంతకం నాది కాదు, ఫోర్జరీ చేశారని ఫోరెన్సిక్ పరీక్షలో తేలుతుందన్నారామె. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే.. ‘మా అమ్మాయి తనకు తెలియకుండా ఆమే పేరుమీద ప్రాఫర్టీ పెడుతున్నారని కేసు ఫైల్ చేయడానికి వచ్చింది’ అని సర్ది చెప్పి అందరి దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా.. అందరి ముందు కూతురు నిలదీయడంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భావోద్వేగానికిలోనై కంటతడి పెట్టారు. కూతురును తన రాజకీయ ప్రత్యర్థులు తప్పు త్రోవ పట్టించి తనపై ఉసిగొలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద వస్తున్న ఆరోపణలలో నిజం లేదని, కుటుంబ సమస్యను రాజకీయ ప్రత్యర్ధ్యులు పావుగా వాడుకుంటున్నారని అన్నారు.
తన ఇంటి సమస్యను ప్రజా జీవితానికి ఆపాదించడం ప్రత్యర్థులకు సరైంది కాదన్నారు. తాను సంపాదించి ఇచ్చిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుందని ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో తప్పు చేస్తే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని తెలిపారు. మరో వైపు ఎమ్మెల్యే, కూతురు మధ్య ఆస్తి వివాదం స్థానికంగా కలకలం సృష్టించగా రాజకీయ ప్రత్యర్థులకు ప్రచార అస్త్రంగా మారింది.
చదవండి: మొగోడివైతే మీసాలు మెలేయాలి.. మెలేయడానికి నీకు మీసాలు లేవు..
Comments
Please login to add a commentAdd a comment