కల చెదురుతోంది.. కథ మారుతోంది! భద్రం బ్రదరూ! | Consultancies Cheating Students In The Name Abroad Studies | Sakshi
Sakshi News home page

కల చెదురుతోంది.. కథ మారుతోంది! భద్రం బ్రదరూ!

Published Tue, Aug 2 2022 2:51 AM | Last Updated on Tue, Aug 2 2022 3:45 PM

Consultancies Cheating Students In The Name Abroad Studies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ చదువుల మోజులో అనేకమంది విద్యార్థులు కన్సల్టెన్సీల మాయలో పడి మోసపోతున్నారు. ప్రతి ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో ఈ తంతు సర్వసాధారణంగా మారిపోయింది. ఇదే సమయంలో విదేశాల్లో ఎంఎస్‌ కోర్సులకు ప్రవేశాలుంటాయి. దీంతో వివిధ రూపాల్లో గ్రాడ్యుయేట్ల, ముఖ్యంగా ఇంజనీరింగ్‌ విద్యార్థుల ఫోన్‌ నంబర్లు సంపాదిస్తున్న కన్సల్టెన్సీలు, ఏ దేశంలో కావాలంటే ఆ దేశంలోని వర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నాయి.

ఇందుకు అవసరమైన అన్ని పత్రాలూ తామే రెడీ చేస్తామని చెబుతున్నాయి. అంతేకాదు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు తాత్కాలిక సర్దుబాటు చేసేవారిని ఏర్పాటు చేస్తామంటూ విద్యార్థుల్ని ముగ్గులోకి దింపుతున్నాయి. దీంతో ఏదో ఒక కారణంగా అమెరికా లాంటి విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ కన్సల్టెన్సీల వలలో చిక్కుతున్నారు.  

లక్షకు రూ.10 వేలు కమీషన్‌! 
మన రాష్ట్రం నుంచి ఎంఎస్‌ కోసం ఏటా ఒక్క అమెరికా నుంచే 12 వేల మంది వెళ్తున్నారు.కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలకు మరో 15 వేల మంది వెళ్తున్నారు. ఎంఎస్‌ కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ వర్సిటీ ఫీజులతో పాటు, చదువుకునే సమయంలో ఖర్చులన్నీ తానే భరించాలి. చదువు పూర్తయ్యే వరకు ఎలాంటి ఉద్యోగం చేయడానికి వీల్లేదు. దీంతో విశ్వవిద్యాలయం ఫీజు రూ.25 లక్షలు, ఇతర ఖర్చులకు మరికొంత నగదు బ్యాంకులో ఉన్నట్టు చూపించాలి.

లేదా తగిన ఆదాయ వనరులున్నట్టు అధికారిక పత్రాలు చూపించాలి. ఇంజనీరింగ్‌ తర్వాత కొనసాగింపుగా మరే కోర్సులోనూ చేరని వాళ్లు, ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నట్టుగా చూపించాలి. సంబంధిత పత్రాలతో పాటు, ఉద్యోగానుభవానికి సంబంధించిన పత్రాలు కూడా కన్సల్టెన్సీలే సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఊరూ పేరూ లేని కంపెనీలతో నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, ఇంటర్న్‌షిప్‌ చేసినట్టు ధ్రువపత్రాలు పుట్టిస్తున్నారు.

అంతేకాదు వాళ్లే విద్యార్థి పేరుతో అప్పటికప్పుడు ఖాతా తెరిపించి, అందులో తమకు తెలిసిన వారి ద్వారా డబ్బులు వేయిస్తున్నారు. ముందు చెక్‌పై సంతకం పెట్టించుకుని విద్యార్థి వెళ్లిన వెంటనే డ్రా చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు తీసుకుంటున్నారు. బ్యాంకులో డబ్బులు వేసిన వ్యక్తికి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్‌ ఇప్పిస్తున్నారు. 

నకిలీలపై పెరిగిన నిఘా..
అమెరికా, మరికొన్ని దేశాలు నకిలీ పత్రాలు, బ్యాంకు ఖాతాలపై గత రెండేళ్ళుగా దృష్టి పెట్టాయి. ప్రైవేటు సంస్థల చేత విచారణ చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది ఇలాంటి అనేక ఉదంతాలు వెలుగుచూశాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా కన్సల్టెన్సీల దందా కొనసాగుతూనే ఉంది. విద్యార్థులు మోసపోతూనే ఉన్నారు.

కొన్నిసార్లు వీసానే మంజూరు కావడం లేదు. మరికొన్ని సందర్భాల్లో వీసా వచ్చి విమానం ఎక్కినా విదేశాల్లో దిగాక విమానాశ్రయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కేసుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలాంటి సమస్య లేకుండా బయటపడ్డారనే సమాచారం తెలిసేవరకు గుండెలరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు.  

దొరికిన వారెందరో.. 
ఢిల్లీలోని అమెరికన్‌ ఎంబసీ ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో ఈ విధమైన నకిలీ పత్రాలు వెలుగు చూశాయి. దీంతో ఎంబసీ అధికారులు ఢిల్లీ చాణక్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు చేసి పలువురిని అరెస్టు చేశారు.  

హైదరాబాద్‌ ఎర్రగడ్డకు చెందిన వెర్టెక్స్‌ నెట్‌కామ్‌ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసినట్టు ఓ కన్సల్టెన్సీ నకిలీ పత్రాలు సృష్టించినట్టు తేలింది. ఇదే సంస్థ పేరుతో ఇంటర్న్‌షిప్‌ లెటర్, మహారాష్ట్రలోని గోదావరి అర్బన్‌ మల్టీస్టేట్‌ క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంకు పాస్‌బుక్, అందులో రూ.24 లక్షలున్నట్టు పత్రాలు సమర్పించి దొరికిపోయారు.  

వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి సాఫ్ట్‌టెక్‌ కంప్యూటర్స్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొని, ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో రూ.25 లక్షలు ఉన్నట్టు చూపించి పట్టుబడ్డాడు.ఇదే జిల్లాకు చెందిన మరో అభ్యర్థి సాఫ్ట్‌టెక్‌ కంప్యూటర్స్‌లో పైతాన్‌ కోర్సు చేసినట్టు నకిలీ పత్రాలు సమర్పించి పట్టుబడ్డాడు.  

ఏప్రిల్‌ నెలలో మొత్తం ఆరు కన్సల్టెన్సీ సంస్థలపై కేసులు నమోదు కావడం గమనార్హం. 

నాన్న కల నిజం చేయాలని.. 
హైదరాబాద్‌లోని సుచిత్ర సర్కిల్‌లో ఉండే కన్సల్టెన్సీ ఏజెంట్‌ ఫోన్‌ చేసి నమ్మించాడు. అమెరికాలో చదువు కోవడమే కాకుండా, ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తానన్నాడు. మా నాన్నకు నేను అమెరికా వెళ్లాలనేది కల. అక్కడ అందరూ డాలర్లు సంపాదిస్తున్నారనే ఆలోచన ఉండేది. ఆయన కల నిజం చేయాలని కన్సల్టెన్సీ చెప్పినట్టు చేశాం. బ్యాంకు ఖాతాలో ఎవరు డబ్బులేశారో? అనుభవ పత్రాలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియదు. వీసా ఇంటర్వ్యూలో అమెరికన్‌ ఎంబసీ కనిపెట్టింది. నేను నిజం చెప్పి తప్పించుకున్నాను. కానీ రూ.4 లక్షల వరకు పోగొట్టుకున్నాను.  
– నవీన్‌ (అమెరికన్‌ ఎంబసీ వీసా ఇంటర్వ్యూలో పట్టుబడ్డ విద్యార్థి, వరంగల్‌) 

కన్సల్టెన్సీల ఉచ్చులో పడొద్దు 
విదేశాలకు వెళ్లే విద్యార్థులు తెలియకుండానే కన్సల్టెన్సీల ఉచ్చులో పడుతున్నారు.ఒకసారి వెళ్ళాక ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ విదేశాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉంది. విశ్వసనీయత కోణంలో వాళ్ళు చూస్తారు. ఈ మధ్య సర్టిఫికెట్లు కూడా నకిలీవి సృష్టిస్తున్నారు. ఇలాంటి మార్గాన్ని విద్యార్థులు ఎంచుకోవద్దు.  
– తుమ్మల పాపిరెడ్డి (ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement