నగరవాసులకు ప్రీతిపాత్రమైన దమ్ కా రోట్ తిరిగి వచ్చింది. మొహర్రం నెల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ కుకీ.. మతాలకు అతీతంగా హలీమ్ తరహాలోనే నగరవాసులకు దగ్గరైంది. అన్ని బేకరీల్లో తయారు చేసి విక్రయించే ఈ ప్రసిద్ధ కుకీ... హిజ్రీ క్యాలెండర్‌లోని మొదటి నెల అయిన మొహర్రం టైమ్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. బంధుమిత్రులకు ఇచి్చపుచ్చుకునే సంప్రదాయం వల్ల దీనికి మొహర్రం నెల అంతా ఫుల్ డిమాండ్ ఉంటుంది.
ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన మనమడు ముఖరంజా బహద్దూర్ సుఖసంతోషాలు, భధ్రమైన భవిష్యత్తు కోసం ఈ రోట్‌ని చారి్మనార్ దగ్గరలోని నాలా ఏ ముబారక్ ఆలమ్‌కు అందించారని నమ్ముతారు. అప్పటి నుంచి ఇది ఒక సంప్రదాయంగా స్థిరపడిందట. నిజాం మొహర్రం ఊరేగింపులో దుఃఖితులకు ఈ రకమైన కుక్కీని అందించినట్లు మరో కథనం కూడా ఉంది.
ఇళ్లలో పుట్టి బేకరీలలో మెట్టి..
మొహర్రం సందర్భంగా అప్పటి నుంచి తమ వారి క్షేమాన్ని కాంక్షిస్తూ ఈ రోట్‌ని ఇళ్లలో తయారు చేసి ఆలమ్ దగ్గర పంచడం సంప్రదాయం. ఇళ్లలో దీనిని పిండి ముద్దగా చేశాక ఒవెన్లలో వేసి బేకింగ్ చేయడం కోసం బేకరీలకు తీసుకురావడం ఆ తర్వాత మొదలైంది. అలా ఇప్పుడు బేకరీలే తయారు చేసి విక్రయిస్తున్నాయి. ఇప్పటికీ కొందరు ఇళ్లలోనే తయారు చేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నప్పటికీ అత్యధికులు మాత్రం సుభాన్ బేకరీ తదితర ప్రసిద్ధ బేకరీలలోనే కొనుగోలు చేస్తుంటారు. కాగా ప్రస్తుతం ప్రసిద్ధ బేకరీలన్నింటిలో ప్రస్తుతం రోట్ రద్దీ కనిపిస్తోంది.
ప్రముఖులు సైతం కొనుగోలు చేస్తారు..
ఈ దమ్ కా రోట్‌ని బేకరీల్లో విక్రయిస్తున్న అత్యంత పురాతన బేకరీ మాది. పూర్తి సంప్రదాయబద్ధంగా తయారు చేసిన ఈ రోట్‌ని నగరవాసులు అత్యంత ఇష్టంగా మొహర్రం నెలలో కొనుగోలు చేస్తారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ సమయంలో భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చి తయారు చేయించి దగ్గరవారికి పంపిణీ చేస్తుంటారు. హాఫ్‌కేజీ, కేజీ.. బ్యాగ్స్‌లో
ఈ రోట్‌ను విక్రయిస్తున్నాం.
–సయ్యద్ లుక్మన్, సుభాన్ బేకరీ
అదిరిపోయే క్రేజ్...
‘దమ్ కా రోట్’ అనేది క్రిస్పీ కుకీగా పేర్కొనవచ్చు. ఇది దాదాపు టీ సాసర్ పరిమాణంలో ఉంటుంది. గోధుమ పిండి, రవ్వ, కూరగాయల నూనె, చక్కెర, తేనె, బటర్, ఉప్పు, యాలకులు, పాల ఉత్పత్తులతో దీన్ని తయారుచేస్తారు. దీని రుచికి ఫిదా అయిపోతున్న నగరవాసులు భారీగా కొనుగోళ్లు చేస్తుండడంతో.. నగరంలోని రోట్ తయారీదారులు రుచి ధరల పరంగా పోటీ పడుతున్నారు. ‘ఇది పూర్తి శాఖాహారం. దీని తయారీలో మేం గుడ్లను ఉపయోగించం’అని నాంపల్లిలోని సుభాన్ బేకరీకి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ అన్నారు.
అంతర్జాతీయ ఎగుమతులు
పూర్తిగా హైదరాబాద్‌కు చెందిన ఈ సంప్రదాయ వంటకం.. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా విస్తరించింది. కుల, మతాలకు అతీతంగా ప్రజలు తమ బేకరీని సందర్శించి దమ్ కా రోట్‌ను కొనుగోలు చేస్తున్నారని పిస్తా హౌస్‌కు చెందిన ఎంఏ మజీద్ అంటున్నారు. పదార్థాలకు బెల్లం కేసర్ జోడించి టోలిచౌకిలోని బేక్‌వెల్ కేక్ హౌస్‌లో ‘గుర్ రోట్’ పేరిట మరో రకం కుకీని విక్రయిస్తున్నారు. అంతేకాక ఈ కుకీకి పెరిగిన ఆదరణతో ఇతర దేశాలకు సైతం బేకరీలు
సరఫరా చేస్తున్నాయి.
మూడు దశాబ్దాలుగా...
గోల్కొండ: మూడు దశాబ్దాలకు పైగా నగర వాసులకు రుచికరమైన దమ్ కా రోట్‌లు అందిస్తున్నాం. టోలిచౌకీ వద్ద ఉన్న పిస్తాహౌజ్‌లో దమ్ కా రోట్‌ల అమ్మకాలను శనివారం ప్రారంభించాం. ఇవి కేవలం మొహర్రం మాసంలోనే అందుబాటులో ఉంటాయి. దమ్ కా రోట్‌ల తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వేయించిన రవ్వ, డ్రైఫ్రూట్స్ వాడుతాం.
– ఎండి అబ్దుల్ మోసిన్, పిస్తాహౌజ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment