![line clear new tspsc: Justice Shamim Akhtar](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/JOBS23.jpg.webp?itok=nTP8aPVa)
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీకి తొలగిన అడ్డంకులు
ప్రభుత్వానికి అందిన ఎస్సీ వర్గీకరణపై వన్‌మెన్ కమిషన్ సిఫారసులు
త్వరలో వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం
అనంతరం ఉద్యోగ ప్రకటనలకు చాన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండడంతో గత కొన్ని నెలలుగా కొత్తగా ఉద్యోగ ప్రకటనలు వెలువడలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలోని వివరాలతో కూడిన ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాగా వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్తగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుంటుంది.
ఉత్తర్వుల రూపకల్పనపై కసరత్తు
ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఉత్తర్వుల రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడంతో పాటు ఉన్నతాధికారులతో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు రెండ్రోజులుగా ఈ అంశంపైనే అధికారులు దృష్టి సారించారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేలా చర్యలు వేగవంతం చేశారు. జస్టిస్ షమీప్ అక్తర్ కమిషన్.. 2011 జనగణన ఆధారంగా రాష్ట్రంలోని ఎస్సీ కేటగిరీలోని 59 కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని సూచించింది.
గ్రూప్–1లో 15 కులాలు, గ్రూప్–2లో 18 కులాలు, గ్రూప్–3లో 26 కులాలను చేర్చాలని సూచించింది. నాలుగు సిఫారసులు చేయగా.. ఇందులో మూడింటికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం, ఒక సిఫారసును మాత్రం తిరస్కరించింది. ఉద్యోగ నియామకాల్లో క్రమపద్ధతిని అనుసరించేందుకు ప్రాధాన్యత నమూనాను కూడా రూపొందించింది. గ్రూప్–1లో నోటిఫై చేసి, భర్తీ చేయని ఖాళీలను తదుపరి ప్రాధాన్యత గ్రూప్‌లో.. అంటే గ్రూప్–2లో భర్తీ చేయాలి. ఇందులో భర్తీ చేయని ఖాళీలను గ్రూప్–3లో భర్తీ చేయాలి. అన్ని గ్రూపుల్లో తగిన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఆ పోస్టులను క్యారీఫార్వర్డ్ చేయాలని స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాల్లో వారికి కేటాయించిన గ్రూపుల వారీ రిజర్వేషన్లకు రోస్టర్ పాయింట్ల నంబర్లను కూడా కమిషన్ సిఫారసు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment