బుధవారం మిర్యాలగూడ మండలంలోని యాద్గార్‌పల్లి రోడ్డులో నిలిచి ఉన్న ధాన్యం ట్రాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: వరిసాగు, ధాన్యం సేకరణ ప్రధానాంశంగా రాష్ట్రంలో గత కొంతకాలంగా రాజకీయ రగడ కొనసాగుతోంది. అధికార పక్షం, విపక్షాలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నాయి. వ్యక్తిగత దూషణలకు సైతం పాల్పడుతున్నాయి. తాజాగా పోటా పోటీ ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు దిగుతున్నాయి. ఇన్నాళ్లూ పాదయాత్రలు, బహిరంగ సభలు, హుజూరాబాద్ ఉప ఎన్నిక వేదికగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మొన్నటివరకు హుజూరా బాద్ ఉప ఎన్నికపై ప్రధానంగా దృష్టి పెట్టిన పార్టీలు ఇప్పుడు వరి సాగు, ధాన్యం సేకరణను తెరపైకి తెచ్చి విమర్శల జోరు పెంచాయి.
అయితే కొంతకాలంగా ఉప ఎన్నికతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన అధికార టీఆర్‌ఎస్ కూడా.. ప్రభుత్వంపై విపక్ష నేతలు ప్రత్యేకించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసే ఆరోపణలు, విమర్శలకు దీటుగా జవాబిస్తూ వస్తోంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు విపక్షాల విమర్శలపై ఘాటుగా ప్రతిస్పందిస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నేరుగా రంగంలోకి దిగారు. విపక్ష నేతలపై ఎదురుదాడి ప్రారంభించారు.
రెండురోజుల పాటు వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. విపక్షాలపై ముఖ్యంగా బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా తీసుకుని.. బీజేపీతో పాటు, కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టారు. ఆయన వ్యాఖ్యలపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తమదైన శైలిలో ప్రతి స్పందించారు. ఈ నేపథ్యంలోనే ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలకు తెరలేచింది.
బీజేపీకి అడ్డుకట్టే లక్ష్యంగా..
వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతూ ఈ నెల 12న శుక్రవారం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ యంత్రాంగానికి పిలుపునిచ్చారు. దీంతో శాసన మండలి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లా కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతులు తీసుకుని ధర్నా చేపట్టేందుకు టీఆర్‌ఎస్ నేతలు సన్నాహాలు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ బలాన్ని చాటడంతో పాటు కేంద్రం వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే రీతిలో ధర్నాలు జరిగేలా ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందిన బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. రాష్ట ఆవిర్భావం తర్వాత ఏపీలో ఏడు మండలాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ 2014లో అధికార టీఆర్‌ఎస్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రత్యక్ష నిరసనకు దిగడం ఇదే తొలిసారి అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పడం వల్లే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులను వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రహితంగా వ్యవహరిస్తోంది. గత ఏడాదికి సంబంధించిన 5 లక్షల టన్నుల బియ్యాన్నే కేంద్రం ఇప్పటికీ
తీసుకోలేదు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం వరి సాగుపై రైతులను రెచ్చగొట్టేలా అబద్ధపు హామీలు ఇస్తున్నారు. – ముఖ్యమంత్రి కేసీఆర్
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వానిది కేవలం దళారీ పాత్ర మాత్రమే, కేంద్రమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. వరి సాగు చేయొద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను అనవసరంగా భయాందోళనలకు గురి చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.
– బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం కొనుగోలు చేయకుంటే... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? ప్రభుత్వం కొనుగోలు చేయని పక్షంలో వ్యాపారులు తక్కువ ధరకు కొంటారు. రైతులు నష్టపోతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ.. ఈనెల 12న అన్ని జిల్లా కలెక్టర్ల ముందు నిరసన కారక్రమాలు చేపడ్తాం.
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ధాన్యం కొనుగోలులో బాయిల్డ్, ముడి బియ్యం అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదు. వరి సాగు విస్తీర్ణం తగ్గించడం సమస్య పరిష్కారంలో ఒక భాగమే అయినా దిగుబడిని తగ్గించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతి చేసుకునేందుకు మిల్లర్లకు అవకాశం ఇవ్వాలి. రైతులు నేరుగా ధాన్యాన్ని మిల్లర్లకు విక్రయించే వ్యవస్థ రావాలి.
– తూడి దేవేందర్‌రెడ్డి, అధ్యక్షుడు, దక్షిణ భారత రైస్ మిల్లర్ల సంఘాల సమాఖ్య
భారం తగ్గించుకునేందుకే..?
ఈ నెల 12న టీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాకు పోటీగా బీజేపీ రాష్ట్ర శాఖ నిరసనకు దిగుతోంది. ధాన్యం కొనుగోలుకు 6,500 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు కేవలం వేయి చోట్ల మాత్రమే ప్రారంభించడాన్ని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. వరి సాగు విస్తీర్ణం పెరిగితే కరెంటు వినియోగం పెరుగుతుందని, ఆ మేరకు విద్యుత్ కొనుగోలు భారం నుంచి తప్పించుకునేందుకే, నెపాన్ని కేంద్రం మీదకు నెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నెల 11న గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో తమ పార్టీ అనుబంధ సంఘాలతో కలిసి ధర్నా నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ఇదిలా ఉంటే సీపీఎం కూడా వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా ఈ నెల 12న ధర్నా నిర్వహిస్తోంది. టీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ మాత్రం.. ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి వైఖరి ప్రకటించలేదు. బుధవారం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వరి ధాన్యం కొనుగోలుపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment