సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల సన్నద్ధతను పూర్తిస్థాయిలో పార్టీ అధినాయకత్వమే పర్యవేక్షిస్తోంది. పార్టీకి సంబంధించిన ప్రతీ కార్యక్రమం రూపకల్పన కూడా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనుసన్నల్లోనే సాగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తేవడంతోపాటు ఇక్కడ పది దాకా లోక్‌సభ సీట్లు గెలిచేందుకు సానుకూల పరిస్థితులున్నాయన్న అంచనాల మధ్య రాష్ట్రంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో అధినాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా 25 నుంచి 30 బృందాలను మోహరించినట్టు విశ్వసనీయ సమాచారం.
క్షేత్రస్థాయి పరిస్థితులపై కన్ను
మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వేలతో ఇతర రూపాల్లో అవసరమైన సమాచారాన్ని అధినాయకత్వం సేకరిస్తోంది. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కునేందుకు వీలుగా రాజకీయంగా, ఇతరత్రా ముఖ్యమైన అంశాలపై సమాచారాన్ని సేకరిస్తోంది. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై దృష్టితో ఈ బృందాలు అధ్యయనాలు, పరిశీలనలు, సర్వేలు వంటివి చేస్తూ చురుకుగా సాగుతున్నాయి.
గ్రామస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులపై పార్టీకి సంబంధం లేకుండా సర్వేలు నిర్వహిస్తున్నాయి. అమిత్‌షా ప్రత్యక్ష పర్యవేక్షణలో, నేరుగా ఆయన కార్యాలయానికే నివేదించేలా ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ (ఏబీఎం) ఆధ్వర్యంలో నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఏబీఎం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ సమాచార సేకరణలో తలమునకలైంది. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీకోసం పనిచేసిన బృందాలు కూడా తెలంగాణలో రంగంలోకి దిగి పనిచేయడం ప్రారంభించాయి.
ఐఐటీ, ఐఐఎం నిపుణులతో...
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎంలలో పట్టాలు పొందిన వారిని బీజేపీ అధినాయకత్వం రంగంలోకి దించింది. ఎన్నికలకు సంబంధించిన కసరత్తు, గణాంకాల సేకరణ, విశ్లేషణలతో అనుభవమున్న వారిని ఈ విధులకు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలోకి వచ్చే మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు.. వాటి పరిధిలోని కులాలు, వర్గాల వారీగా ఓట్లు ఎన్ని ఉన్నాయనేది వీరు సేకరిస్తున్నారు.
ఆ నియోజక వర్గంలో పోటీకి సిద్ధపడుతున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరు, వారి సామాజికవర్గం, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ప్రభావితం చేసే కులాలు, ఆయా అభ్యర్థుల బలాలు, బలహీనతలు, అక్కడి రాజకీయ పరిస్థితులపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, బీఆర్‌ఎస్ లోటుపాట్లు, రాజకీయంగా ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై ఈ బృందాలు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతున్నాయి. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థ పార్టీకి సమాంతరంగా పనిచేస్తోంది.
ఆయా పర్యటనల్లో పార్టీ ముఖ్య నేతలు ఏ అంశాలు మాట్లాడాలి, ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఫీడ్‌బ్యాక్ తదితరాల్లోనూ ఏబీఎం సూచనలే కీలకంగా మారినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీలోని అన్ని స్థాయిల నాయకులకు బాధ్యతల నిర్వహణపై టార్గెట్లు విధించడంతోపాటు ఆయా బాధ్యతలను వారు ఎలా నిర్వర్తిస్తున్నారనే దానిపైనా పర్యావేక్షణ సాగిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment