నేడు తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ | New Statue of Telangana Thalli to be Unveiled on December 9th | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ

Published Mon, Dec 9 2024 4:07 AM | Last Updated on Mon, Dec 9 2024 4:07 AM

New Statue of Telangana Thalli to be Unveiled on December 9th

సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రçహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు

సచివాలయ ఆవరణలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రం 6:05 గంటలకు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొంటారు.

రాష్ట్ర నలుమూలల నుంచి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. కాగా, విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఇతర మంత్రులతో కలిసి పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి రమణారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ సన్మానించారు. పోరాట స్ఫూర్తిని చాటేలా విగ్రహాన్ని తీర్చిదిద్దారని ఆయన్ను కొనియాడారు.. 

భారీగా తరలిరండి: మహేష్ కుమార్‌గౌడ్‌
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవా రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉందని, ఈ సభకు కాంగ్రెస్‌ శ్రేణు లు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్‌లతో ఆయన జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడారు. ఏడాది కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు.

తెలంగాణ తల్లిపై ప్రేమ ఉన్న ప్రతిఒక్కరూ వస్తారు: మంత్రి కోమటిరెడ్డి
‘‘తెలంగాణపై, తెలంగాణ తల్లిపై ప్రేమ ఉన్న ప్రతీ ఒక్కరూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వస్తారు. తెలంగాణ అంటే ఇష్టం లేనివారు రారు. నిజమైన తెలంగాణవాదులెవరో తెలిసే వేదిక ఇది.’’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన ఆదివారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

వేదికపై ప్రజా ప్రతినిధులందరూ కూర్చునేలా ఏర్పాట్లు చేయాలని, సభకు వచ్చే ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సచివాలయ భద్రతాసిబ్బంది, ఇతర పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని అన్ని రాజకీయ పక్షాలను ఆహా్వనించామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement