ఎడ్ల నాగలికి డిమాండ్‌.. రోజుకు రూ.3వేలు | Oxen Ploughing Karimnagar Daily Rs 3000 Fare | Sakshi
Sakshi News home page

ఎడ్ల నాగలికి డిమాండ్‌.. రోజుకు రూ.3వేలు

Published Thu, Jun 30 2022 9:45 PM | Last Updated on Thu, Jun 30 2022 9:47 PM

Oxen Ploughing Karimnagar Daily Rs 3000 Fare - Sakshi

జగిత్యాల అగ్రికల్చర్‌: వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. నాగళ్లు.. కాడెడ్లు కనుమరుగు అవుతుండగా సమయం ఆదాకోసం రైతులు సైతం యాంత్రీకరణ వ్యవసాయం వైపే చూస్తున్నారు. కాడెడ్లు, నాగలిపట్టే మట్టిమనుషులు కరువవుతున్నారు. దీంతో విత్తనాలు వేసేందుకు కాడెడ్లతో పాటు దున్నేందుకు మనిషిని కిరాయి తీసుకునే పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పసుపు, పత్తి వంటి విత్తనం వేసేందుకు మనిషికి నాగలితో సహా రూ.3వేల వరకు చెల్లిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కాడెడ్ల పోషణ నుంచి తప్పుకుంటున్న అన్నదాత
► గ్రామాల్లో ప్రతీరైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. కనీసం ఒక జత కాడెడ్లు లేనివారిని రైతులు అనేవారు కాదు. కాడెడ్లను అమ్ముకునేవారు కాదు. ప్రస్తుతం కాడెడ్లను పోషించే స్థోమత రైతులకు ఉన్నప్పటికీ, వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్మేస్తున్నారు.
► దుక్కి దున్నడం నుంచి పంటకోసే వరకు ప్రతీపని ట్రాక్టర్‌తో చేయడం, ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఉండడం, వాటికి రకరకాల పరికరాలు తయారు చేసుకుని వినియోగిస్తున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు ట్రాక్టర్‌ కొనుగోలు చేసి వ్యవసాయానికి వాడుతున్నారు.
► ప్రస్తుతం ఏ గ్రామంలో చూసిన పది జతల మించి కాడెడ్లు లేవు. దీంతో విత్తనం వేసేందుకు కాడెడ్లు ఉన్నవారివైపు మిగతా రైతులు చూసే పరిస్థితి నెలకొంది. గతంలో ఇరుగుపొరుగు వారు కలిసి విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటం, భూమిలో తేమ ఎక్కువైనా, తక్కువైనా విత్తనాలు వేయడం ఇబ్బందిగా మారడంతో కాడెడ్ల కోసం రైతులు వెతికకే పరిస్థితి నెలకొంది.
► ట్రాక్టర్‌తో పోల్చితే కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే, భూమిలో అనుకున్నంత లోతులో విత్తనం పడి, బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. జగిత్యాల జిల్లా రైతులు ఎక్కువగా పసుపు విత్తనం వేసేందుకు కాడెడ్లపైనే ఆధారపడుతుండటంతో, ఎడ్ల నాగలికి గిరాకీ పెరిగింది. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోనూ పత్తివిత్తనాలు వేసేందుకు కాడెడ్లు ఉన్నవారిని ఆశ్రయిస్తున్నారు.
► కాడెడ్లు ఉన్నవారికి ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దున్నితే రూ.3 వేలు ఇస్తున్నారు. మరికొంతమంది విత్తనాలు వేసేవరకు కేవలం కాడెడ్లను రూ.10–15 వేలకు కిరాయికి తీసుకొస్తున్నారు. ఎద్దుల జత ధర రూ.70వేల నుంచి రూ.80వేల వరకు ఉండటంతో కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు.

రూ.3వేలకు కిరాయికి తీసుకున్న
పెద్దగా పనిలేక ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3 వేలకు కిరాయికి తీసుకున్నా. వారంరోజుల ముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్సులు ఇవ్వాల్సిన పరిస్థితి. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
– క్యాతం సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్‌

ఎడ్లు దొరికే పరిస్థితి లేదు 
విత్తనం కోసం ఎడ్లు కొందామన్నప్పటికీ దొరికే పరిస్థితి లేదు. ఒక్కోజతకు రూ.80 వేల ధర ఉంది. దీంతో, విత్తనం వేసే వారం రోజులు ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాను. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్‌ ఉపయోగిస్తాను.
– రాంకిషన్, వెల్దుర్తి, జగిత్యాల రూరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement