ప్రజా పాలన విజయోత్సవాలకు వేగంగా ఏర్పాట్లు
శాఖలవారీగా సిద్ధమైన కార్యక్రమాల షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9 వరకు నిర్వహించతలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు అన్ని శాఖలు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యక్రమాల షెడ్యూల్‌ను సిద్ధం చేశాయి. సంబంధిత శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రుల సారథ్యంలో ఈ కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఆ మేరకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
విజయోత్సవాల్లో నిర్వహించే ముఖ్య కార్యక్రమాలు
» ఇప్పటికే ప్రారంభమైన 28 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణాలకు తోడు మరో 26 పాఠశాలలకు ఈ విజయోత్సవాల్లోనే శంకుస్థాపనలు చేయనున్నారు.
» స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు సీఎం కప్ పేరుతో అన్ని గ్రామాల్లో వివిధ క్రీడా పోటీలు జరుపుతారు.
» కొత్తగా 16 నర్సింగ్, 28 పారామెడికల్ కళాశాలలను ప్రారంభిస్తారు. 213 కొత్త ఆంబులెన్సులను ప్రజలకు అందుబాటులోకి తెస్తారు.
» ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాకు ఒక ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ను ప్రారంభిస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమిస్తారు.
» హైదరాబాద్ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కొత్త భవనాలకు శంకుస్థాపన చేస్తారు. గోషామహల్‌లో నిర్మించతలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేస్తారు. ఆరాంఘర్–జూపార్క్ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఆరు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్‌టీపీ) ప్రారంభిస్తారు. రూ.826 కోట్లతో కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ పనులకు శ్రీకారం చుడతారు. శిల్పకళా వేదిక సమీపంలో 106 స్టాళ్లతో ఏర్పాటుచేసిన ఇందిరా శక్తి మహిళా బజార్‌ను ప్రారంభిస్తారు.
» తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అటవీ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్‌లను ప్రారంభిస్తారు.
» ఘట్‌కేసర్‌లో బాలికల ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. మల్లేపల్లి, మేడ్చల్, నల్లగొండ ఏటీసీలను ప్రారంభిస్తారు.
» దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 237 కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుడతారు.
» ఇప్పటికే ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ తరగతులను ప్రారంభిస్తారు. స్పోర్ట్స్ యూనివర్శిటీకి భూమిపూజ చేస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో ఏఐసిటీ ఏర్పాటుతో పాటు పలు ఒప్పందాలు చేసుకుంటారు.
» రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఏడాది పాలనపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment