సాక్షి, హైదరాబాద్: సర్కారు విధించిన ఫీజు సీలింగ్ ఆధారంగా కరోనా బాధితులకు వైద్యం చేయడం తమకు సాధ్యంకాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. సగం పడకలను ప్రభుత్వానికి అప్పగిస్తామని, అయితే 14 రోజుల వైద్యానికి గరిష్టంగా రూ.4 లక్షలే వసూలు చేయాలన్న ప్రతిపాదన అసాధ్యమని అంటున్నారు. అది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలకు చెందిన ఒక కీలక ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీనిపై త్వరలో ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. కొనసాగుతున్న ప్రతిష్టంభన: ప్రైవేట్, కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై గతంలో ప్రభుత్వం ఒక జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. రోజుకు సాధారణ వార్డులో కరోనా చికిత్స పొందే వ్యక్తి నుంచి రూ.4 వేలు, ఆక్సిజన్ వార్డు అయితే రూ.7,500, ఐసీయూలో అయితే రూ.9వేల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. పీపీఈ కిట్లు, మందులు, ఇతరత్రా వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. కానీ సర్కార్ నిర్ణయాన్ని ఏ ఆసుపత్రీ అమలు చేయడం లేదని బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. (సందేహాలకు సమాధానమిస్తాం: కేసీఆర్)
దీంతో సగం పడకలను తమకు అప్పగించాలని ఇటీవల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందుకు వారూ అంగీకరించారు. తర్వాత ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావుతో జరిగిన సమావేశంలో సగం పడకలకు ఎంత వసూలు చేయాలన్న దానిపై ఒక సీలింగ్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. 14 రోజులకు అన్నీ కలిపి సాధారణ పడకలకు రూ.లక్ష, ఆక్సిజన్ బెడ్‌కు రూ.2లక్షలు, ఐసీయూ పడకలకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేయాలని సీలింగ్ విధించింది. ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేసుకొని రావాలని కోరింది. కానీ ఇప్పటికీ దీనిపై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎలాంటి నిర్ణయమూ ప్రభుత్వానికి ప్రతిపాదించలేదు. దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా, సర్కారు సీలింగ్ మేరకు సగం పడకలు ఇవ్వడం తమకు గిట్టుబాటు కాదని, కొత్త సీలింగ్ ఫీజులను ప్రభుత్వానికి త్వరలో ప్రతిపాదిస్తామని ఆసుపత్రుల ప్రతినిధి ఒకరు తెలిపారు. బాధితులకు ఇతరత్రా అనారోగ్య సమస్యలుంటే చేయాల్సిన టెస్టులు.. అత్యవసర మందులకు అధిక ఖర్చు అవుతుందని, తమకు వాస్తవంగా అయ్యే ఖర్చును ఆధారం చేసుకొని ఈ ప్రతిపాదనను సర్కారు తెలియజేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment