తెలంగాణవ్యాప్తంగా 11వేల ప్రైవేటు స్కూళ్లలో 35 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయని, ఎప్పటికప్పుడు భరించలేని విధంగా పెంచుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ఎన్ని జీవోలు తెచ్చినా అవి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది.
స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకూ వార్షిక ఫీజును ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఏటా ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచుతున్నట్టు ప్రభుత్వం దృష్టికొచ్చింది.
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఓ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలు స్వాగతిస్తున్నాయి. వీలైనంత త్వరగా పటిష్టమైన నియంత్రణాధికారంతో చట్టం తేవాలని మేధావులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
వాస్తవానికి పేదవర్గాలను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేసే వ్యవస్థలపై 2016లోనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి ఆచార్య తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు కూడా చేసింది. ఇప్పుడు ఆ సిఫారసులను కూడా పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
పలు రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు
ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. మొత్తం 11 వేల ప్రై వేటు స్కూళ్ళను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చే యోచనలో ఉంది.
ఆచార్య తిరుపతిరావు సిఫారసులేంటి?
ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల మనోభీష్టాన్ని తెలుసుకుంది. కాగా బడ్జెట్ స్కూళ్ళు (వార్షిక ఫీజు రూ. 20 వేల లోపు ఉండేవి) ఫీజుల నియంత్రణను స్వాగతించాయి.
♦స్కూల్ డెవలప్‌మెంట్ (అభివృద్ధి) చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15 శాతం ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇదే సమస్యగా మారింది. పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారు. తర్వాత ఫీజులు 25 శాతం పెంచారు.
♦స్కూళ్ళ మూడేళ్ళ ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచు కుని కొన్ని సిఫారసులు తెరమీదకొచ్చాయి.
♦ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులన్నీ బ్యాంకు ద్వారానే చెల్లించాలి. విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానా, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దును కమిటీ సిఫారసు చేసింది.
♦ఈ విధానం అమలుచేస్తే చాలా స్కూళ్ళు 10 శాతానికి లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతిరావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్‌లైన్‌ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ ప్రతిపాదనలే మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం.
చట్టం అమల్లో చిత్తశుద్ధి అవసరం
ఫీజుల నియంత్రణ పేదవాడికి ఊరటనిస్తుంది. దీనికోసం చట్టం తేవడానికే మంత్రివర్గ ఉప సంఘం వేశారంటే స్వాగతించాల్సిందే. అయితే చట్టం తెస్తే సరిపోదు. చట్టం అమలులో చిత్తశుద్ధి అవసరం. అన్ని వర్గాల మనోభావాలకు అనుగుణంగా ఫీజులను నియంత్రించేలా చట్టం ఉండాలి. నియంత్రణలో తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి.
– వెంకటసాయినాథ్ కడప, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్
ప్రై వేటు స్కూళ్ల నిర్వాహకులను చేర్చాలి
ప్రభుత్వం నిర్వహించే మోడ ల్, జెడ్పీ స్కూల్స్ మధ్యే నిర్వహ ణ ఖర్చులో తేడా ఉంటుంది. అదే విధంగా ప్రైవేటు బడుల్లోనూ ఆదాయ వ్యయాల్లో తేడా ఉంటుంది.దీన్ని పరిగణనలోనికి తీసుకుని ఫీజులపై నియంత్రణ ఉండాలి. రూ.20 వేల కన్నా తక్కువ ఫీజులున్న స్కూళ్ళను ఈ చట్టం పరిధిలోకి తెస్తే ఉపయోగం ఉండదు. చట్టంలో ప్రై వేటు స్కూళ్ళ యాజమాన్యాల భాగస్వామ్యం ఉండేలా చూడాలి.
– యాదగిరి శేఖర్‌రావు, గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్ల (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు
చట్టంతోనే ఫీజులకు అదుపు
పిల్లల టెన్త్ పూర్తయ్యే సరికి ప్రై వేటు స్కూళ్ళ ఫీజుల కోసం స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. స్కూల్లో కొత్తగా ఏమీ పెట్టకపోయినా ఏటా ఫీజులు పెంచుతున్నారు. అడ్డగోలు ఫీజులపై అధికారులకు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదు. చట్టం తీసుకొస్తేనే పేదవాడికి ఉపశమనంగా ఉంటుంది.
– వి. సూర్యప్రకాశ్‌రావు, విద్యార్థి తండ్రి, ముత్తారం, ఖమ్మం జిల్లా
పటిష్టమైన చట్టం అవసరమే
అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి అవసరమైన సిఫారసులు చేశాం. వీటిని అమలు చేసే దిశగా.. అవసరమైన చట్టం తేవాలనే దృఢ చిత్తంతో ప్రభుత్వం ముందుకెళ్ళడం హర్షణీయం. ఈ చట్టం ఏ విధమైన సమస్యలకు తావు లేకుండా, ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగానికి ఉపయోగ పడేలా ఉంటుందని ఆశిస్తున్నా.
– ఆచార్య తిరుపతిరావు, ప్రభుత్వ కమిటీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment