సాక్షి, హైదరాబాద్: పోలీసులు తమ ప్రవర్తనాశైలిని మార్చుకోవాలని, ప్రజల కోసమే వారు పనిచేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని భయాందోళనకు గురిచేసేలా వ్యవహరించవద్దని, వారు పోలీస్ స్టేషన్‌కు సరదాగా రారన్న విషయం తెలుసుకోవాలని స్పష్టం చేసింది. అవసరమైతే పోలీసుల విధులేంటో వారికి తెలిసేలా ఆన్‌లైన్ విధానంలోనైనా అవగాహన తరగతులు నిర్వహించాలని డీజీపీని ఆదేశించింది. ఈ విషయాన్ని డీజీపీకి తెలియజేయాలని అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌కు సూచించింది.
ఇప్పటికీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులు, న్యాయవాదులు, వైద్యుల వద్దకు ప్రజలు విధిలేకే వస్తారన్న విషయం గుర్తుంచుకుని మసలుకోవాలని చెప్పింది. తమ కేసు తీసుకోవడం లేదంటూ భవిష్యత్‌లో ఏ ఫిర్యాదుదారుడు కోర్టుకు రాకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించింది. తనపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఫిర్యాదు చేసినా కరీంనగర్ టూటౌన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం లేదంటూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా కరీంనగర్ టూటౌన్ ఎస్‌హెచ్‌ఓను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించడంతో ఆయన హాజరయ్యారు.
ఎస్‌హెచ్‌ఓ వివరణ ఇవ్వాల్సిందే...
ఆ మహిళ ఫిర్యాదు మేరకు 14న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఏఏజీ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యానికి క్షమాపణ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఎస్‌హెచ్‌ఓ మాత్రం జాప్యంపై వివరణ ఇవ్వాల్సిందేనని తే ల్చిచెప్పింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓ మహిళ స్టేషన్‌లో ఉంటే ఎందుకు వచ్చారో కనుక్కోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానించింది.
స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారన్న విషయాన్ని గ్రహించాలంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా తప్పుడు ఫిర్యాదుగా నిర్ధారణకు రావద్దని స్పష్టం చేసింది. మనమంతా చట్టానికి బద్ధులమై పనిచేస్తున్నామని, అందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని నొక్కి చెప్పింది. ప్రజలకు సేవలు అందించేలా స్టేషన్లలో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని డీజీపీకి సూచించింది. ఎస్‌హెచ్‌ఓ వివరణ కోసం విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది. ఆలోగా ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యానికి కారణాలను తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment