సత్యవేడు గురుకులం జ్వరం.. కలకలం
● 56 మంది విద్యార్థులకు తీవ్ర జ్వరం ● పరామర్శించిన కలెక్టర్ ● ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
సత్యవేడు: సత్యవేడు ఎంజేపీఏపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు 56 మంది తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వెంటనే వీరిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థులను పరామర్శించారు. జ్వరాలపై ఆరా తీశారు. జ్వరపీడితులులను డాక్టర్‌గా కలెక్టర్ పరీక్షించారు. చేతులు, కండ్లు, గొంతు పరీక్షించారు. జ్వరం ఎప్పటి నుంచి ఉంది.. హాస్టల్‌లో ఎంతమందికి జ్వరం వచ్చింది, అందరికీ ఒకేసారి వచ్చిందా..? మధ్యాహ్న భోజనం చేశారా, అన్నం తినగలుగుతున్నారా..? అని విద్యార్థులను ప్రశ్నించారు. విద్యార్థులకు వైద్యశాలలో ఏఏ పరీక్షలు నిర్వహించారని సీహెచ్‌సీ డాక్టర్ సురేష్‌ను ప్రశ్నించారు. పిల్లలకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్లు, సీఆర్‌పీ, సీబీసీ పరీక్షలు నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. కుప్పం మండలానికి చెందిన జీ.శివశంకర్ (6వ తరగతి)కి తీవ్ర జ్వరం ఉండడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశామని డాక్టర్ తెలిపారు.
డీఎంహెచ్‌ఓ తనిఖీ
సత్యవేడు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సపొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులను డీఎంహెచ్‌ఓ శ్రీహరి పరామర్శించారు. అనంతరం పాఠశాలలోని మరుగుదొడ్లు, స్నానపు గదులు, నీటి వసతులను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, స్నానపు గదులకు తలుపులు లేవు. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో కలెక్టర్‌కు సమాచారం అందించారు.
వైద్యశిబిరం
డీఎంహెచ్‌ఓ ఆదేశాల మేరకు దాసుకుప్పం పీహెచ్‌సీ డాక్టర్ గుణశేఖర్ తన సిబ్బందితో రెండు రోజుల పాటు గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్షించి మందులు, మాత్రలు అందించారు. అలాగే ఎంపీడీఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ మునిరవికుమార్ దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టారు.
హాస్టల్‌లో వసతులపై సీరియస్
గురుకుల పాఠశాల హాస్టల్‌లో స్నానపు గదులు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. మరుదొడ్ల శుభ్రత సక్రమంగా లేవని మండిపడ్డారు. వార్డన్, నర్సు భువనేశ్వరి, ప్రినిపల్ శ్రీనివాసులును పిలిచి మందలించారు. మరో పర్యాయం ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వైద్యశాలలో గైనకాలజిస్టు, అనస్తీషియా పోస్టులు భర్తీ చేయాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. నియోజవర్గ కేంద్రంలో 108 వాహనం లేదన్నారు. స్పందించిన కలెక్టర్ వైద్యశాలకు రెండు వారాల్లో రెండు పోస్టులు భర్తీ చేసేందుకు చొరవ చూపుతామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యశాలల సమన్వయాధికారి ఆనందమూర్తి, డీఎంహెచ్‌ఓ శ్రీహరి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, తహసీల్దారు సుబ్రమణ్యం, ఎంపీడీఓ ఎన్.చంద్రశేఖర్, ఎంఈఓ కే.రవి, దాసుకుప్పం పీహెచ్‌సీ డాక్టర్లు, సత్యవేడు సీహెచ్‌సీ డాక్టర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment