ఉల్లిక్కి పడాల్సిందే!
ఉల్లి ధర ఆకాశాన్నంటుతోంది. దిగుబడి తగ్గిపోవడం.. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడడంతో వినియోగదారులకు నరకం కనిపిస్తోంది. ఒక్కసారిగా ధర పెరిగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వ పెద్దలు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
తిరుపతి అర్బన్: కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పప్పుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు అధికరేట్లు పలుకుతున్నాయి. చివరకు ఉల్లి కోస్తే కాదు.. కొనాలంటేనే కళ్లు నీళ్లు తిరుగుతున్నాయి. ధరలు అదుపు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని అంతా మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒకటంటే ఒక్కటి కూడా ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– ఎర్రగడ్డలు(ఉల్లిగడ్డలు) మేలు రకం కేజీ రూ.70, తగ్గురకం రూ.60 పలుకుతున్నాయి. మరీ నాసిరకం రూ.50 పలుకుపతోంది. ప్రతి వంటకు ఉల్లిపాయ తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో ఉల్లి ధరలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. దీంతో సామాన్యుడికి ధరల బెంగ తప్పడం లేదు. గతంలో ఉల్లిపాయలు కిలో మేలు రకం రూ.25, తగ్గురకం రూ.20 ఉండేవి. చౌకదుకాణాల్లో ఉల్లిపాయలను ప్రభుత్వం రాయితీతో అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
వంటింట్లో కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి ధరతో ప్రజలకు గుండె దడ కిలో కనిష్టం రూ.50, గరిష్టం రూ.70
Comments
Please login to add a commentAdd a comment