అవగాహన లేకపోవడంతోనే..
వాకాడు: ఆక్వా సాగు పట్ల మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నా ఎక్కడో సంబంధం లేని, అవగాహన లేని టెక్నీషియన్ల సలహాలతో అవసరం లేని మందులను రొయ్యల చెరువుల్లో వెదజల్లడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జిల్లా మత్స్యశాఖ జేడీ నాగరాజ తెలిపారు. బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అపదొచ్చింది రొయ్యో’ కథనంపై ఆయన స్పందించారు. జిల్లాలో ఎక్కడైతే ఆక్వా సాగు జరుగుతుందో ఆయా ప్రాంతాల్లో మత్స్యశాఖ ఏడీలు, ఎఫ్‌డీఓలు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని రైతులకు సూచించారు. సొంతంగా మందులు కొనుగోలు చేసినట్టయితే ఆయా మందుల డబ్బాలపై కోస్టల్ ఆక్వా అథారిటీ (సీఏఎ) ముద్ర ఉంటేనే కొనుగోలు చేయాలని చెప్పారు. ఏవైనా అవసరముంటే తన మొబైల్ నం.9441646148కి ఫోన్ చేసినా తగు సూచనలు, సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ధర్నా వైపు ఆర్టీసీ అడుగులు
ఈ నెల 19, 20 తేదీల్లో టీ విరామంలో ధర్నా
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తయినా ఆర్టీసీ సమస్యలు ఒక్కటీ పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ఈ నెల 19, 20 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలతో విధులు నిర్వహించడంతోపాటు ఉదయం 11 గంటల టీ విరామ సమయంలో ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దళవాయి గురునాథం, కార్యదర్శి తండాయం సత్యనారాయణ గురువారం ఉద్యోగులకు సమాచారం జారీచేశారు. 19, 20 తేదీల్లో తిరుపతి జిల్లాలోని 11 డిపోలకు చెందిన ఉద్యోగులు ఆయా డిపోల పరిధిలో ధర్నా చేపట్టాలని చెప్పారు. కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని, ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, జాప్యం లేకుండా పదొన్నతలు కల్పించాలని, పెంచిన పేస్కేల్ ప్రకారం అరియర్స్ చెల్లించాలని, డీఏల పంపిణీలో జాప్యం లేకుండా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆర్ట్స్ రీజినల్ సెంటర్
ఏర్పాటుపై ఎంఓయూ
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏ) సంస్థల మధ్య రీజినల్ సెంటర్ ఏర్పాటు కోసం పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. వర్సిటీలో గురువారం ఈ మేరకు ఇరువురు అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సంస్కృత వర్సిటీలో భారతీయ కళా సంస్కృతి, వైశిష్ట్యం, ప్రత్యేకించి సాహిత్యం, సంగీతం, నాటకం, శిల్పకళలు, ఫొటోగ్రఫీ, చిత్రలేఖనం, ఎంబ్రాయిడింగ్ వంటి విషయాలపై భారతావని అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ఐజీఎన్‌సీఏతో ఒప్పందం జరగడం శుభపరిణామన్నారు. ఐజీఎన్‌సీఏ డైరెక్టర్ డాక్టర్ ప్రియాంక మిశ్రా, వర్సిటీ రిజిస్ట్రార్ రమశ్రీ, అధికారులు పాల్గొన్నారు.
18న ఉద్యోగమేళా
శ్రీకాళహస్తి: పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ నెల 18వ తేదీన రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంచ్, డీఆర్‌డీఏ, సీడ్‌ఆఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేళాకు పలు బహుళజాతి కంపెనీలు హాజరవుతాయని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లొమో, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే యువతీ, యువకులు తమ వెంట ఆధార్‌కార్డు, విద్యార్హత జిరాక్స్ కాపీలు, బయోడేటా ఫాంతో రావాలని సూచించారు. సంబంధిత వెబ్‌సైట్‌లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 7989509540, 8919889609 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
వచ్చే నెల 4 నుంచి డిగ్రీ పరీక్షలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల మూ డవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలు డిసెంబర్ 4 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దామ్లానాయక్ తెలిపారు. ఈ మేరకు టైమ్ టేబుల్‌ను పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment