మహిళ దారుణ హత్య
● అక్క కాపురం బాగుండాలని అత్తను చంపిన అల్లుడు
తిరుపతి క్రైం: నగరంలోని సింగాలగుంటలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన సంఘట గురువారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం మేరకు.. సింగాలగుంటలో నివాసముంటున్న జోగారావు, కొబ్బరికాయల వ్యాపారి వెంకటలక్ష్మి దంపతులకు కొడుకు విజయ్(26), కూతురు(నాగలక్ష్మి) ఉన్నారు. అదే వీధిలోని ద్రాక్షాయణి(50)కు పురుషోత్తం అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో నాగలక్ష్మి, పురుషోత్తం ప్రేమించుకుని 2013లో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం పురుషోత్తం తల్లికి దూరంగా ఉండేందుకు భవానినగర్‌లో కాపురం పెట్టాడు. పురుషోత్తం ఇంటికి సమీపంలో ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నాగలక్ష్మి పురుషోత్తం వద్ద డబ్బులు తీసుకుని పుట్టింటి వారికి ఇస్తున్నట్లుగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా గొడవ చోటు చేసుకుంది. దీంతో నాగలక్ష్మి కుటుంబ సభ్యులందరూ వచ్చి పురుషోత్తంతో గొడవపడ్డారు. పురుషోత్తం ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోయాడు. వీరు కూడా నాగలక్ష్మిని సింగాలగుంటలోని పుట్టింటికి తీసుకొచ్చారు. ఈ గొడవలకు అంతా కారణం పురుషోత్తం తల్లి ద్రాక్షాయణి అని నాగలక్ష్మి తమ్ముడు విజయ్ భావించాడు. ఆమె చచ్చిపోతే తన అక్క కాపురం బాగుంటుందని, నిరంతరం ఆమె కారణంగానే గొడవలు వస్తున్నాయని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొబ్బరికాయలు కొట్టే కత్తి తీసుకుని సింగాలగుంటలోని పురుషోత్తం తల్లి ద్రాక్షాయణి ఇంటికి వెళ్లి, ఆమె తలపై కత్తితో నరికాడు. దీంతో ఆమె కింద పడిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు గమనించి, ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గురువారం వేకువజామున 5.30 గంటలకు మృతి చెందింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నాగలక్ష్మి తమ్ముడు విజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment