చేపా..చేపా.. చెరువులోకెప్పుడెళతావ్!
● సీజన్ ముగిశాక... చేప పిల్లలకు గ్రీన్‌సిగ్నల్
తిరుపతి అర్బన్: సీజన్ ముగిశాక...చెరువుల్లో చేపపిల్లలు వదిలిపెట్టాలంటూ ప్రభుత్వం నుంచి మత్స్యశాఖకు గురువారం గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. వరుస తుపాన్లతో అన్ని చెరువులు నిండాయి. ఏటా నవంబర్‌లో చేప పిల్లలను వదిలిపెట్టేవారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ ముగుస్తున్న తరుణంలో చేపపిల్లలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వంతో టెండర్లు ఎప్పుడు ఆహ్వానిస్తారు?.. ఆ తర్వాత జిల్లాకు ఎప్పుడు తీసుకొస్తారు. చెరువుల్లో వదిలిపెట్టడానికి ఎంత సమయం పడుతుంది.. ఇలా మత్స్యశాఖ అధికారులకు అన్ని ప్రశ్నలే మిగిలాయి.
గత ఐదేళ్లలో ఏటా సకాలంలోనే చేపపిల్లలు
గత ఐదేళ్లలో ప్రతి ఏటా 60 లక్షల నుంచి కోటి చేపపిల్లలను బాపట్ల నుంచి తిరుపతి జిల్లాకు సెప్టెంబర్ 10వ తేదీలోపు దిగుమతి చేసేవారు. రెండు నెలలపాటు తిరుపతి మత్స్యశాఖ జిల్లా కార్యాలయంలో జాలర్ల సమక్షంలో వాటి పెంచేవారు. తర్వాత నవంబర్ 10 నుంచి 30వ తేదిలోపు జిల్లాలోని మత్స్యశాఖ పరిధిలోని 134 సొసైటీ చెరువుల్లో చేపపిల్లలను వదిలిపెట్టేవారు. అంతేకాకుండా కాళంగి, కల్యాణ్‌డ్యామ్, అరణియార్ ప్రాజెక్టుకు చేపపిల్లలను ఇచ్చేవారు. ఆ తర్వాత మిగిలిన చేపపిల్లలను ఇతర ఇరిగేషన్, పంచాయతీరాజ్ పరిధిలోని చెరువులకు వదిలిపెట్టేవారు.
ఈ ఏడాది సీజన్ పూర్తి అయ్యింది...
ఈ ఏడాది మరో పది రోజుల్లో డిసెంబర్ పూర్తి కానుంది. ఈ సమయంలో చేపపిల్లలను తెచ్చి తిరుపతిలో పెంచడానికి సమయం లేదు. మరోవైపు తిరుపతి మత్స్యశాఖ కార్యాలయంలో చేపపిల్లలను పెంచడానికి తొట్టెలు సక్రమంగా లేవు. చేపపిల్లలు వచ్చినప్పటికీ నేరుగా వాటిని చెరువుల్లో వదిలిపెట్టాల్సి ఉంది. చేపపిల్లలను చెరువుల్లో వదిలిపెట్టడానికి మత్స్యవ్యాపారుల నుంచి ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది. టెండర్లు దక్కించుకు న్న వారు జిల్లాల వారీగా చెరువులకు పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మరో నెల రోజుల సమయం పడుతుంది. అంటే వచ్చే ఏడాది జనవరి 20 తర్వాతే. అయితే మార్చికే చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతుంది. దీంతో దిగుబడి తగ్గి నష్టాలు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.
నెలాఖరుకల్లా చేప పిల్లలు వదిలే ప్రయత్నం చేస్తాం
చెరువులకు చేపపిల్లలు వదిలిపెట్టడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. జిల్లాలో 134 మత్స్యశాఖ పరిధిలోని సొసైటీ చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు 68 లక్షల చేపపిల్లలు అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు 30 చెరువులకు పూర్తిగా నీరు రాలేదు. 104 చెరువులు మాత్రమే పూర్తిగా నిండాయి. మరోవైపు కాళంగి.అరణియార్ ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. కల్యాణ్ డ్యామ్ 70 శాతమే నీరు ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత చేపపిల్లలు వచ్చిన వెంటనే చెరువులకు వదిలిపెట్టే ప్రయత్నం చేస్తాం. జాలర్ల సమక్షంలో చేపపిల్లలను పెంచడానికి సమయం లేదు. –నాగరాజు, మత్స్యశాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment