ఉబ్బలమడుగులో మునిగి యువకుడి మృతి
బుచ్చినాయుడుకండ్రిగ: విహార యాత్ర విషాదాన్ని నింపింది. మండలంలోని ఉబ్బలమడుగు జలపాతంలో నీట మునిగి యువకుడి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ఉబ్బలమడుగు జలపాతానికి మంగళవారం మధ్యాహ్నం తిరువల్లూరు జిల్లా, తిరునత్తూరుకు చెందిన డానియిల్‌కింగ్‌స్టాన్ కారులో ఐదుగురు స్నేహితులతో కలసి విహారయాత్రకు వచ్చారు. డానియిల్‌కింగ్‌స్టాన్ (21) స్నేహితులతో కలసి ఉబ్బలమడుగులోని ఎగువశీతలానికి వెళ్లి నీటిలోకి దూకేశాడు. ఆ తర్వాత బయటకు రాలేకపోయాడు. స్నేహితులు బుచ్చినాయుడుకండ్రిగలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథనాయుడు, ఫైర్, అటవీశాఖ సిబ్బంది సహాయంతో నీటిలో గాలించగా, రాళ్ల మధ్యలో ఇరుక్కుని చనిపోయిన డానియిల్‌కింగ్‌స్టాన్ శవాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తిమ్మయ్య, ఎస్‌ఐ విశ్వనాథనాయుడు తెలిపారు.
రూ.54 లక్షలు కొట్టేశారు
తిరుపతి రూరల్: పార్ట్‌టైం జాబ్ పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్యకు మస్కా కొట్టి రూ.54 లక్షలను సైబర్ నేరగాళ్లు కొట్టేసిన ఘటన తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురంలో చోటుచేసుకుంది. రూరల్ సీఐ చిన్న గోవిందు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి రూరల్ మండలం, శ్రీనివాసపురం పంచాయతీ, సరస్వతీ నగర్‌కు చెందిన సుజాత ఇంటి వద్ద జీవనం సాగిస్తూ ఉంటారు. ఆమె భర్త సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. డిసెంబర్ 14న సుజాతకు గుర్తుతెలియని వ్యక్తుల వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. పార్ట్ టైం జాబ్ అవకాశం ఉందని, లింకు క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వాలని తెలిపారు. నమ్మకంతో ఆమె టెలిగ్రామ్ గ్రూపులో చేరారు. వారిచ్చిన 13 బ్యాంకు ఖాతాలకు ఈనెల 14 నుంచి 24వ తేదీ వరకు మొత్తం రూ.54 లక్షలను పంపించారు. అదనంగా మరో రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో ఆమె మోసపోయినట్లు గుర్తించి తల్లిదండ్రులకు తెలిపారు. 1930 నంబర్‌కు సైబర్ ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడంతో రూ.7 లక్షలు హోల్డ్ చేశారు. అనంతరం బాధితురాలు తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ చిన్న గోవిందు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment