సరస్వతీ ఒడిలో.. రాజకీయ కుంపట్లు!
తిరుపతి టాస్క్‌ఫోర్స్: సరస్వతీ నిలయమైన ఎస్వీయూలో రాజకీయ కుంపట్లు రాజేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎస్వీయూ ఏడీ బిల్డింగ్ రాజకీయ వేదికగా మారిపోయింది. గత ఆరు నెలలుగా జరుగుతున్న పాలన అస్తవ్యస్తంగా తయారైంది. అధికార పార్టీ అనుచరులను అధికారులుగా నియమించడంతోనే సమస్య ప్రారంభమైంది. వర్సిటీ అధికారుల వ్యవహార శైలిపై అటు ఉద్యోగులు, ఇటు విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు పలుమార్లు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ వేదికగా ఏడీ బిల్డింగ్
వర్సిటీ పరిపాలనా భవనంలో ప్రధాన అధికారుల పేషీలలో ప్రతినిత్యం అధికాార పార్టీకి చెందిన, వర్సిటీకి సంబంధంలేని వ్యక్తులు హల్‌చల్ చేస్తుంటారు. దీనిపై ప్రసార మాధ్యమాలు, పత్రికలు కోడైకూసినా పట్టించుకున్న పాపాన పోలేదు. 70 ఏళ్ల వర్సిటీ చరిత్రలో మత విద్వేషాలు, ప్రచారాలు జరిగిన సందర్భాలు లేవు. అలాంటిది వర్సిటీలో అలజడి రేపి ప్రశాంతతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగి గందరగోళం సృష్టించారు. పలు విభాగాలలో అధ్యాపకుల కొరతను చూపించి సుమారు 300 మంది తాత్కాలిక అధ్యాపకుల నియామకాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ కార్యకర్తల ఆదేశాల మేరకు వర్సిటీలో పాలన సాగుతోందని ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అందులోనూ రాజకీయమే
వర్సిటీలో పనిచేస్తున్న సుమారు 260 మందికిపైగా ఉన్న తాత్కాలిక ఉద్యోగులకు 110జీవో అమలు చేయకుండా సాగదీతతో సరిపెడుతున్నారు. సామర్థ్య పరీక్షల పేరుతో వారిని సాగనంపే దిశగా ప్రయత్నాలు జరగుతున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు. అలానే గత ప్రభుత్వం శాశ్వత అధ్యాపకుల నియామకం కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి నిరుద్యోగుల కడపుకొట్టారని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అంచెలంచెలుగా తాత్కాలిక బోధనేతర సిబ్బందిని, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించి రోడ్డున పడేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శాశ్వత ఉద్యోగులను సైతం ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేశారు.
ఆరు నెలలుగా
ఎస్వీయూ పాలన అస్తవ్యస్తం
ఎటు చూసినా అవినీతి ఆరోపణలు, కక్ష సాధింపు చర్యలే
అర్హతలేని స్థానాలకు వందల సంఖ్యలో ఉద్యోగుల బదిలీలు
సక్రమంగా జీతాలు చెల్లించడం లేదంటూ ఉద్యోగుల ఆరోపణలు
వేతనాల వెతలు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెల నుంచే ఒకటో తారీఖున వేతనాలు జమ చేస్తామని ప్రగల్భాలు పలికిన బాబు సర్కార్ గత ఆరు నెలలల్లో ఒక్క నెల సైతం సమయానికి జీతాలు చెల్లించిన పాపాన పోలేదు. రెండు, మూడు మాసాలకోసారి వేతనాలు చెల్లించడంతో ఉద్యోగులు అప్పులు చేసి, బంగారు తాకట్టుపెట్టుకుని కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోంది. వర్సిటీ పెన్షనర్ల పరిస్థితి వర్ణనాతీతం.
తుక్కునూ వదల్లేదు!
ఎస్వీయూలో గత 20 ఏళ్లకు పైగా పేరుకుపోయిన స్క్రాప్‌పై అధికారుల కన్నుపడిందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. సుమారు రూ.60 లక్షల విలువగల స్క్రాప్‌ను ఎటువంటి టెండర్లు లేకుండా అధికార పార్టీకి చెందిన ప్రముఖ నేత ఆదేశాలతో పార్టీ అనుచరులకు రూ.8 లక్షలకే విక్రయించినట్లు విద్యార్థి సంఘాలు శుక్రవారం నిరసన చేపట్టాయి. ఈ మేరకు రిజిస్ట్రార్‌ను తన చాంబర్‌లో నిలదీశారు.
కక్ష సాధింపు చర్యలేంటి?
వర్సిటీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సుమారు 150 మందికి పైగా ఉద్యోగుల అంతర్ బదిలీలకు తెరతీసిన అధికారులు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. తమ అనుచర వర్గానికి, అధికార పార్టీకి అనుచరులుగా గుర్తింపు పొందిన ఉద్యోగులను అర్హత లేకున్నా ప్రాధాన్యత గల పోస్టుల్లో కూర్చోబెట్టారు. దీంతో పాటు తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఉద్యోగులను, విద్యార్థి సంఘాలను ప్రొత్సహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేరిన ఉద్యోగులను విధుల నుంచి తొలగించి రోడ్డున పడేశారు.
Comments
Please login to add a commentAdd a comment