తూకాలు తగ్గిస్తే చర్యలు
తిరుపతి అర్బన్: రేషన్ డీలర్లు బియ్యం పంపిణీలో తూకాలు తగ్గిస్తే చర్యలు తప్పవని జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శేషాచలంరాజు హెచ్చరించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గిడ్డంగుల నుంచే తూకాలు తక్కువగా వచ్చాయంటూ కార్డుదారులకు తగ్గిస్తే ఊరుకోమన్నారు. మనిషికి 4 కిలోల చొప్పున వారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అందించాలని చెప్పారు. బియ్యం ఉచితంగా ఇవ్వాలని, కంది పప్పు కేజీ రూ.65, చక్కెర అర కిలో రూ.17 లెక్కన కార్డుదారులకు అందించాలన్నారు. జనవరి 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సరుకులు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను త్వరలో భర్తీ చేస్తామన్నారు.
ఎరచ్రందనంపై పటిష్ట నిఘా
తిరుపతి మంగళం : ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా పటిష్ట నిఘా పెట్టాలని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ అటవీ, టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు మంగళవారం అటవీ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా పెంచలకోన, సోమశిల, లంకమల అటవీ ప్రాంతాలలో పర్యటించారు. పెంచలకోన, బద్వేలు, సిద్ధవటం, రైల్వే కోడూరులలో ఈ సమావేశాలను సోమ, మంగళవారాల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా టాస్క్‌ఫోర్స్ ఎస్పీ మాట్లాడుతూ ఎరచ్రందనం స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించే ఎంట్రీ, ఎగ్జిట్, లోడింగ్ పాయింట్లు వద్ద నిఘా పటిష్టం చేయాలన్నారు. అటవీశాఖ చెక్ పోస్టులలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. భవిష్యత్తులో టాస్క్ ఫోర్స్ అటవీ శాఖతో కలసి ప్రత్యేక మాస్ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు. డీఎస్పీలు జీ.బాలిరెడ్డి, వీ.శ్రీనివాసులురెడ్డి, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు ముగియనున్న రెవెన్యూ సదస్సులు
తిరుపతి అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సదస్సులు ఆ స్థాయిలో ముందుకు సాగలేదు. గత డిసెంబర్ 6న జిల్లా వ్యాప్తంగా 1,051 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులకు శ్రీకారం చుట్టారు. బుధవారంతో ఇవి ముగియనున్నాయి. ఇప్పటి వరకు 16,310 అర్జీలు వివిధ సమస్యలపై అధికారులకు అందాయి. వీటిలో 90శాతం అర్జీలు భూ సమస్యలపైనే ఉన్నాయి. అయితే సదస్సుల్లో సర్టిఫికెట్లు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీరు తదితర సమస్యలకు మాత్రమే కొంత మేరకు పరిష్కారం లభించినట్లు తెలుస్తోంది.
గొబ్బిదేవతకు పుర ఉత్సవం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని గొబ్బిదేవతకు మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అలంకార మండపంలో గొబ్బిదేవత ఉత్సవమూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రతిభ చాటిన ఎస్పీడబ్ల్యూ విద్యార్థినులు
తిరుపతి సిటీ: బ్రెయిలీ జయంతి సందర్భంగా తిరుపతి బ్రెయిలీ హోం ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు జిల్లా స్థాయిలో పలు పోటీలను నిర్వహించారు. పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులు బ్రెయిలీ లిపితో కూడిన చదరంగం బోర్డుపై తమ సత్తా చాటి విజేతలుగా నిలిచారు. అలాగే డిస్కస్‌త్రో, రన్నింగ్, షాట్‌పుట్ తదితర పోటీలలో సైతం ప్రతిభ కనబరచి బహుమతులను అందుకున్నారు. విజేతలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భద్రమణి, అధ్యాపకులు మంగళవారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment