కన్నెత్తి చూస్తే ఒట్టు
సాక్షి టాస్క్‌ఫోర్స్: నాయుడుపేట సమీపంలో స్వర్ణముఖి నదిని కూటమి పార్టీలకు చెందిన ఇసుకాసురులు కుళ్ల బొడిచేస్తున్నారు. పొర్లు కట్టలను ఎక్కడికక్కడ తెగ్గొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతులకు వరప్రసాదినిగా ఉన్న స్వర్ణముఖిలో విచ్చలవిడిగా తవ్వకాలు నిర్వహిస్తూ నదిలో ఇసుక రేణువు లేకుండా తరలిస్తున్నారు. స్థానికంగా నిర్మాణాలకు మినహా ఇసుక తరలింపు చేపట్టరాదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఉత్తర్వులిచ్చినా ఇసుక స్మగ్లర్లు లెక్క చేయడం లేదు. అక్రమంగా తమిళనాడు సరిహద్దులు దాకా తరలిస్తున్నారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి జన్మ స్థలమైన చంద్రగిరి నుంచి వాకాడు మండలంలో సముద్రంలో కలిసే వరకు తవ్వేస్తూ నదికి గర్భ శోకాన్ని కలిగిస్తున్నారు. చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, పెళ్లకూరు, నాయుడుపేట, చిట్టమూరు, వాకాడు మండలాల పరిధిలో యథేచ్ఛగా తవ్వేస్తూ నదిని ఎడారిగా మారుస్తున్నారు.
రోజూ టన్నుల కొద్దీ తవ్వకాలు
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సూళ్లూరుపేట వద్ద కాళంగి నదిని గుల్ల చేసేశారు. స్వర్ణముఖి నదిలో ఇదే తరహాలోనే తవ్వేస్తున్నారు. రోజూ టన్నుల కొద్దీ ఇసుక తవ్వకాలు చేస్తుండడంతో కొద్ది రోజులకు ఈ నదిలో కూడా ఇసుక కరువయ్యే ప్రమాదం లేకపోలేదు. ఒకవైపు నది ప్రవహిస్తుంటే మరోవైపు జేసీబీలు, హిటాచీలు పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారు. ముఖ్యంగా నాయుడుపేట పట్టణం సమీపంలోని పలు గ్రామాల వద్ద పొర్లకట్టలను నిట్టనిలువునా తెగ్గొట్టి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు.
కూటమి నేతల అండదండలతో అధికార పార్టీ కార్యకర్తలు ఇంటికి రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేసి పగలు రాత్రి తేడా లేకుండా తమిళనాడు సరిహద్దుల దాకా ఇసుక తరలిస్తున్నా జాతీయ రహదారిపై ఉన్న నాయుడుపేట, దొరవారిసత్రం, సూళ్లూరుపేట, తడ మండలాలకు చెందిన పోలీసులు కన్నెత్తి చూడడం లేదు. స్వర్ణముఖి ఉప్పొంగిన సమయంలో పరీవాహక గ్రామాలను వరద నీరు ముంచెత్తకుండా రక్షణ కల్పించేందుకు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన పొర్లు కట్టలను తెగ్గొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారు. చిగురుపాడు, భీమవరం, అయ్యపురెడ్డిపాళెం, మర్లపల్లి, అన్నమేడు తదితర గ్రామాలు నది పక్కనే ఉన్నాయి. పొర్లు కట్టలను తెగ్గొడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు పత్తాలేరు.
Comments
Please login to add a commentAdd a comment