ఆరోగ్య భద్రతకు పటిష్ట చర్యలు
తిరుపతి అర్బన్: ఆరోగ్య భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో బాలకృష్ణనాయక్ పిలుపునిచ్చారు. శనివారం తిరుపతిలోని ప్రకాశం రోడ్డు సమీపంలోని అంగన్‌వాడీ స్కూల్, మున్సిపల్ పాఠశాలను ఆయన పరిశీలించారు. శిశు ఆరోగ్య స్క్రీనింగ్ పై మానిటరింగ్ నిర్వహించారు. ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. అంగన్‌వాడీ పరిధిలోని బాలింతలు, గర్భవతులకు అందించాల్సిన వైద్య సేవలను గుర్తుచేశారు. అలాగే విద్యార్థులకు ఆహారంతోపాటు ఆరోగ్య సూత్రాలను తెలియజేయాలని ఆదేశించారు. ప్రోగామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రాంతి, డీఈఐసీ మేనేజర్ గుణశేఖర్, ఏఎన్‌ఎం సుగుణ, ఆశా వర్కర్ లక్ష్మి పాల్గొన్నారు.
ముగిసిన భాషా సంఘం సదస్సు
తిరుపతి సిటీ : కేంద్ర మానవ వనరులశాఖ, సంస్కృత వర్సిటీ, ఏబీఆర్‌ఎస్‌ఎమ్ సంయుక్త ఆధ్వర్యంలో భారతీయ భాషా సంఘం అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శనివారం ముగిసింది. సంస్కృత వర్సిటీ వేదికగా జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి హాజరై ప్రసంగించారు. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో సంస్కృత భాషపై పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. మన వేదాలు, ఉపనిషత్తుల్లోని అంశాలను ఆధునిక సాంకేతిక రంగంలో ఉపయోగించుకుంటూ లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అనంతరం ఏబీఆర్‌ఎస్‌ఎమ్ జాతీయ సహా సంఘటన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ.. మాతృభాష విలువైన వారసత్వ సంపద అన్నారు. సమావేశంలో ఏబీఆర్‌ఎస్‌ఎమ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ వైవీ రామిరెడ్డి, ప్రొఫెసర్ గణపతి భట్, కన్వీనర్ డాక్టర్ బుల్టిదాస్, కో–కన్వీనర్ డాక్టర్ కనపాల కుమార్, పలు విద్యా సంస్థల నుంచి అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment