![అండర్‌పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06tpl133-300052_mr-1738872945-0.jpg.webp?itok=nasuoRri)
అండర్‌పాస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
తిరుపతి మంగళం: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరు పట్టణానికి ప్రధాన మార్గమైన చిల్లకూరు కూడలి వద్ద చైన్నె–కోల్‌కత ప్రధాన రహదారిపై అండర్ పాస్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, ప్రమాదాల నివారణ కోసం అక్కడ వాహన చోదకులు, పాదచారులకు అనుకూలంగా ఉండే విధంగా వెహికల్ అండర్ పాస్ నిర్మాణం చేయాలని గతంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర మంత్రికి విన్నవించారు. ఆ సమయంలో చిల్లకూరు కూడలిలో ట్రాఫిక్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను చూపించి సమస్య తీవ్రతను ఆయనకు వివరించినట్లు ఎంపీ తెలిపారు. ఢిల్లీ పార్లమెంట్‌లో గురువారం ఈ విషయాన్ని మరోసారి ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.45.82 కోట్లతో వెహికల్ అండర్ పాస్ నిర్మాణం మంజూరైందని, ఇది ప్రస్తుతం టెండర్ దశలో ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి గడ్కరీ సమాధానం ఇచ్చినట్లు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి సహకరించిన కేంద్ర మంత్రి గడ్కరీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లు నిండా యి. బుధవారం అర్ధరాత్రి వరకు 58,600 మంది స్వామివారిని దర్శించుకోగా 19,083 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.97 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ
తిరుపతి ఎడ్యుకేషన్: తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 210 గంటల కాలవ్యవధి ఉన్న అసిస్టెంట్ టెక్నీషియన్–కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సుకు 10వ తరగతి, ఆపై విద్యార్హత ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈ కోర్సులో చేరదలచిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 81435 76866, 99851 29995నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment