![కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/19/18kgdgl405-360015_mr_0.jpg.webp?itok=1QV5exFY)
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్)
దౌల్తాబాద్: విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. ఆటలు అంతే ప్రధానం. క్రీడాపోటీల్లో పాల్గొనడంతో పోటీతత్వం స్నేహభావం పెరగడంతో పాటు శారీరక మానసిక ఎదుగుదల ఉంటుందనేది కాదనలేని వాస్తవం. ఇదే విషయం ప్రజాప్రతినిధులు, అధికారులు అవకాశం దొరికినప్పుడల్లా చెబుతుంటారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు విద్యకే పరిమితం అవుతున్నారు. రోజంతా పుస్తకాలతో కుస్తీపడుతూ నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నారు. ఐదేళ్లుగా మండల స్థాయిలో క్రీడాపోటీలు నిర్వహించడంలేదు. ఈ పోటీలు నిర్వహించడం వల్ల పాఠశాల స్థాయి నుంచి మండల స్థాయి, అక్కడి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన వారికి స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు వర్తించే సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కానీ కరోనా పుణ్యమా అని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) పోటీలు నిలిచిపోయాయి.
సత్తా చాటుతున్న గ్రామీణ క్రీడాకారులు
గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో సత్తాచాటే ఆసక్తి ఉన్నా ప్రోత్సహించేవారు కరువయ్యారు. ఐదేళ్ల క్రితం నిర్వహించిన మండల స్థాయి క్రీడాపోటీల్లో విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. కానీ అధికారులు జిల్లా స్థాయి వరకు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. పాఠశాలల్లోనూ పీఈటీలు, పీడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆటలకు విద్యార్థులకు దూరమయ్యారు. ఇప్పటికై నా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
నాలుగు గోడల మధ్య నలుగుతున్న బాల్యం
ఐదేళ్లుగా క్రీడలకు దూరం
కోవిడ్ కారణంగా నిలిచిన ఎస్‌జీఎఫ్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment