![చనిపోయినా ‘కంటి వెలుగై’](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06sdnr804a-640086_mr-1738893952-0.jpg.webp?itok=VXjjefcQ)
చనిపోయినా ‘కంటి వెలుగై’
షాద్‌నగర్: కొడుకు విగత జీవిగా మారినా అతని నేత్రాలు సజీవంగా ఉండాలన్న ఆశయంతో నేత్రదానం చేసి తమ ఔదార్యాన్ని చాటారు ఆ తల్లిదండ్రులు. షాద్‌నగర్‌లోని సీఎస్‌కే వెంచర్‌లో నివసించే కోరమోని హరిభూషణ్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్ (15) బుధవారం పాఠశాల ప్రిన్సిపాల్ మందలించాడని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కన్న కొడుకు మరణించి పుట్టెదు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో నీరజ్ రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కళ్లను దానం చేసినందుకు ఆస్పత్రి వారు ధ్రువపత్రాన్ని జారీ చేశారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం నీరజ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫరూఖ్‌నగర్‌లోని నాగులపల్లి రోడ్డులో ఉన్న శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య నీరజ్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
నీరజ్ నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి
పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థి నీరజ్ ఆత్మహత్యకు కారణమైన శాస్త్ర పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నీరజ్ ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ గురువారం పట్టణంలోని శాస్త్ర పాఠశాల ఎదుట ఏఐఎస్‌ఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలోకి వేళ్లే క్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. నీరజ్ మృతిపై సమగ్రవిచారణ చేపట్టాలని, విద్యార్థి చావుకు కారణమైన పాఠశాలపై చర్యలు తీసుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పవన్‌చౌహన్, ఉపాధ్యక్షుడు శివకుమార్, సహాయ కార్యదర్శి ఆకాష్‌సాయి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ జిల్లా కన్వీనర్ సూర్యప్రకాష్, జిల్లా కన్వీనర్ చందు, రాష్ట్ర కో కన్వీనర్ ప్రదీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment