నేటి నుంచి లగచర్లలో భూ సర్వే
దుద్యాల్: మండలంలో పారిశ్రామికవాడ ఏర్పాటులో భాగంగా శుక్రవారం నుంచి లగచర్ల రెవెన్యూ గ్రామ పరిధిలో భూ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు సిద్ధమయ్యారు. గ్రామ సర్వే నంబర్ 102లో 43 మంది రైతులకు చెందిన 47.25 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. వీటికి సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే తాము భూములు ఇచ్చేది లేదని, తండాలో బడి, గుడి కట్టుకోవాల్సి ఉన్నందున భూములు ఇవ్వలేమని గత సమావేశంలో రైతులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు నిర్వహించే భూ సర్వే ఏ మేరకు జరుగుతుందో చూడాల్సి ఉంది.
నులిపురుగులను నివారిద్దాం
అడిషనల్ కలెక్టర్ సుధీర్
అనంతగిరి: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10న నిర్వహించే నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర సుధీర్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు పిల్లలు 2,34,622 మంది ఉన్నారని, వారికి నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలని సిబ్బందికి సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ము ఖ్యంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరవణ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగాలివ్వండి
రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏల వారసుల ధర్నా
ఇబ్రహీంపట్నం రూరల్: గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81,85 ప్రకారం 61 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో 169 మంది వీఆర్‌ఏలకు నేటికీ పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. ఇప్పటికే 20 మంది వరకు ఉద్యోగం ఇవ్వలేదనే బెంగతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,797 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమ కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేస్తున్న వారికి ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పర్వతాలు ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో 61 సంవత్సరాలు పైబడిన వారసుల సంఘం నాయకులు శ్రీనివాస్, లలిత, యాదయ్య, బాల్‌రాజ్, ప్రదీప్, వెంకటయ్య, కుమార్, యాదగిరి, రాములు, శ్రీనివాస్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
లీలా లక్ష్మారెడ్డికి
భారత్ గౌరవ్ పురస్కార్
ఆమనగల్లు: కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్‌పర్సన్ లీలా లక్ష్మారెడ్డి భారత్ వికాస్ సంఘం ఆధ్వర్యంలో అందించే భారత్ గౌరవ్ పురస్కార్‌ను అందుకున్నారు. పచ్చదనాన్ని కాపాడుకోవడం, భవిష్యత్తు తరాలకు అందమైన ప్రకృతిని అందించాలనే సంకల్పంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి మొక్కలు నాటే కార్యక్రమాలు, పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వికాస్ సంఘం అందించే భారత్ గౌరవ పురస్కార్‌కు ఆమె ఎంపికయ్యారు. కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లా సేడం ప్రాంతంలో భారతీయ వికాస్ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంస్కృతి ఉత్సవ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మజోగాతి చేతులమీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు.
తండాల అభివృద్ధికి కృషి
షాద్‌నగర్: గిరిజన తండాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీను నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండాలను అభివృద్ధి చేయడంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. సమావేశంలో నాయకులు రూప్లా నాయక్, నెహ్రు నాయక్, శ్రీనివాస్ నాయక్, కొర్ర రవినాయక్, రమేష్ నాయక్, మేఘ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment