![పరీక్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vkb91-360018_mr-1738893950-0.jpg.webp?itok=o2XfIwOD)
పరీక్షలకు సన్నద్ధం కండి
అనంతగిరి: పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని, నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు గురువారం వికారాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌లో ప్రేరణ, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షల గడువు దగ్గర పడుతున్నందున సమయం వృథా చేయరాదని సూచించారు. ప్రతి సబ్జెక్టులో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలన్నారు. ప్రేరణ, శిక్షణ తరగతుల్లో సూచించిన మెలకువలు పాటిస్తూ అతి సులభంగా అర్థం చేసుకొని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసేలా సిద్ధం కావాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యం దిశగా అడుగులు వేయాలన్నారు. చదువుకు పేద, ధనిక అనేది బేధం లేదని పట్టుదలతో చదివితే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. వసతి గృహ విద్యార్థులు తల్లిదండ్రులు గర్వించేలా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అబ్రహం లింకన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. వారంతా పేదరికాన్ని జయించారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ జిల్లా అధికారి మల్లేశం, సహాయ సంక్షేమ అధికారులు ఉమాపతి, వీరానందం, శుక్రవర్ధన్ రెడ్డి, ఉపాధ్యాయులు సునీత మేరీ, మాధవాచారి, వేణుగోపాల్, మోటివెటర్స్ కె.రామచంద్రుడు, కె.మాధవి, మహేందర్, ఉదయ్ కుమార్, గోపీనాథ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టుదలతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధ్యం
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచన
పీఎం ఎస్‌హెచ్‌ఆర్‌ఐకు 30 పాఠశాలల ఎంపిక
జిల్లాలో పీఎం ఎస్‌హెచ్‌ఆర్‌ఐ స్కీం కింద 30 పాఠశాలలు ఎంపికై నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఎం ఎస్‌హెచ్‌ఆర్‌ఐ పథకం కింద ఆరు ఆదర్శ పాఠశాలలు, రెండు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, రెండు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, రెండు గురుకుల పాఠశాలలు, 18 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికై నట్లు వివరించారు. ఆయా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థుల కనీస అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ కేంద్రం నిధులను ఖర్చు చేయాలని సూచించారు. సమావేశంలో డీఈఓ రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.
డబుల్ ఇళ్లు పూర్తి చేయండి
జిల్లాలో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 851 ఇళ్లు పూర్తయ్యాయని మిగిలిన వాటిని కూడా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే నీటి వసతి, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్‌డీఏ శ్రీనివాస్, జిల్లా హౌసింగ్ అధికారి కృష్ణయ్య, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రవన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
![పరీక్షలకు సన్నద్ధం కండి1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06vkb91a-360018_mr-1738893950-1.jpg)
పరీక్షలకు సన్నద్ధం కండి
Comments
Please login to add a commentAdd a comment