![సమయం.. ఆసన్నం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06vkb01-360030_mr-1738893951-0.jpg.webp?itok=AwGVjwg3)
సమయం.. ఆసన్నం
వికారాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే.. ఏడాదిగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. రెండు నెలల క్రితం జీపీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేసిన అధికారులు ఇటీవల మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఎన్నికల బరిలో నిలవాలనుకునే వారిలో ఆశలు రేపాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయటంతో ముందుగా జీపీ ఎన్నికలకే వెళ్దామనే సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకదాని తర్వాత మరో ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీపీఓలు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలింగ్ ఎప్పుడు అనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియ పూర్తి
జిల్లాలో 566 జీపీలు ఉండగా మండలాల పునర్విభజన అనంతరం వాటి సంఖ్య 585కు చేరింది. ఇటీవల పక్క జిల్లాలు అయిన నారాయణపేట్, మహబూబ్‌నగర్‌ల నుంచి కొన్ని జీపీలు కలవడంతో పంచాయతీల సంఖ్య మరింత పెరిగి 594కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో 5,058 వార్డులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు అదనంగా అవసరం అవుతాయని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఎంత సిబ్బంది అవసరం, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లు తదితర వివరాలు సేకరించారు. ఓటర్లను వార్డుల వారీగా విభజించే ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబందించి పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం జాబితాను సిద్ధం చేసి జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఆమోదం పొందారు.
సీఎం నోట పంచాయతీ ఎన్నికల మాట
సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది పూర్తి
జీపీల్లో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన
ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
జిల్లాలో 594 పంచాయతీలు, 5,058 వార్డులు
పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
మండలాల వారీగా వివరాలు
మండలం జీపీలు వార్డులు
వికారాబాద్ 21 182
ధారూరు 34 286
మోమిన్‌పేట్ 29 256
బంట్వారం 12 106
మర్పల్లి 29 264
కోట్‌పల్లి 18 150
తాండూరు 33 290
బషీరాబాద్ 39 312
యాలాల 39 318
పెద్దేముల్ 38 308
కొడంగల్ 25 222
దౌల్తాబాద్ 34 298
బొంరాస్‌పేట్ 35 292
దుద్యాల్ 19 158
పరిగి 32 268
పూడూరు 32 282
కుల్కచర్ల 33 280
చౌడాపూర్ 24 202
దోమ 36 308
నవాబుపేట 32 276
మద్దతు కూడగట్టుకునే పనిలో నేతలు
త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలను వారికే రిజర్వు చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరిగిందనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment