డొక్కు బస్సులు.. తప్పని తిప్పలు | Sakshi
Sakshi News home page

డొక్కు బస్సులు.. తప్పని తిప్పలు

Published Tue, May 7 2024 6:35 PM

డొక్క

గుట్ట ఎక్కుతూ మొరాయించిన సర్వీసు

మండుటెండలో కాలినడకన

గమ్యం చేరిన ప్రయాణికులు

ధారూరు: కాలం చెల్లిన బస్సులతో ఆర్టీసీ కాలయాపన చేస్తుండగా.. వాటిల్లో ప్రయాణిస్తున్న వారికి తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఇదే జరిగింది. సామర్థ్యానికి మించిన ప్యాసింజర్స్‌తో ఓ బస్సు అనంతగిరి గుట్ట ఎక్కుతుండగా అది మధ్యలో ఆగిపోయింది. ఎంతకీ కదలక పోవడంతో పాపం ప్రయాణికులు మండుటెండలో కాలినడకన గుట్ట పైకి ఎక్కాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం తాండూరు నుంచి ధారూరు మీదుగా హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీ 29 జెడ్‌ 3609 ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు అనంతగిరిగుట్ట ఎక్కుతూ.. రెండో ఘాట్‌ రోడ్డుపై ఆగిపోయింది. ఎంతకీ కదలకపోవడంతో.. డ్రైవర్‌ ప్రయాణికులను దింపేసి, బస్సును గుట్టపైకి ఎక్కించగా.. ప్యాసింజర్స్‌ మాత్రం.. కాలినడకన గమ్యం చేరుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం. దీనికి కారణం అధికంగా పాసింజర్స్‌ ఉండటం, స్పెషల్‌ గేర్‌ వేసినా ప్రయోజనం లేక.. ప్రయాణికులను దించాల్సి రావడం గమనార్హం.

కాలం చెల్లిన సర్సీసులు

డొక్కు బస్సులు, అవి ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయే తెలియని దుస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోయారు. గుట్ట ఎక్కుతూ బస్సు ఆగిందంటే.. అది ప్రయాణికులకు ఎంత ప్రమాదకరం. ఇలా ఫిట్‌నెస్‌ లేని సర్వీసులను ఎందుకు తిప్పుతున్నారో అధికారులకే తెలియాలని ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తాండూరు డిపో బస్సులే ఎక్కువగా మొరాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇదే విషయమై గతంలో పలువురు సంస్థ అధికారులను అడిగితే.. కొత్త బస్సులు లేకుంటే తామేమ్‌ చేయగలం అంటూ సమాధానం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇలాంటి బస్సుల వలన తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటీవలే జరిగిన ఓ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు మృత్యువాత పడ్డారని భయాందోళన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇలా గుట్టు ఎక్కుతూ బస్సులు ఆగిపోవడం కొత్తేమీ కాదని, అయినా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం వలనే ఇలా జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, విజయవాడ, శ్రీశైలం ముఖ్యంగా అధిక మలుపులతో కూడి, గుట్టపైకి వెళ్లే రహదారుల్లో కొత్త సర్వీసులను తిప్పాలని ప్రయాణికులు కోరుతున్నారు.

డొక్కు బస్సులు.. తప్పని తిప్పలు
1/1

డొక్కు బస్సులు.. తప్పని తిప్పలు

Advertisement

తప్పక చదవండి

Advertisement