సేవలు అగమ్యగోచరం
● ఆరు నెలలుగా ఖాళీగానే ఉన్న జెడ్పీ డిప్యూటీ సీఈఓ పోస్టు ● సీఈఓకు అదనపు బాధ్యతలు ● పనుల కోసం కలెక్టరేట్ బాట పట్టాల్సిన వైనం ● జిల్లా పరిషత్ ఖాతాలో ఏడాదిగా మూలుగుతున్న రూ.2 కోట్ల నిధులు ● కుంటుపడుతున్న అభివృద్ధి
వికారాబాద్: జిల్లా పరిషత్ సేవలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. జెడ్పీ సీఈఓ సుధీర్‌కు ఇన్‌చార్జ్ అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతలు అప్పగించడంతో ఆయన కలెక్టరేట్‌కే పరిమితమయ్యారు. దీంతో ఏ చిన్న అవసరం పడినా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలెక్టరేట్ బాట పట్టాల్సి వస్తోంది. దీనికి తోడు ఆరు నెలలుగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ పోస్టు ఖాళీగా ఉండటంతో పనులు సాగడం లేదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాల్సిన జిల్లా పరిషత్ నామమాత్రంగా మారింది. ఏడాదిగా జెడ్పీ ఖాతాలో రూ.2 కోట్లు మూలుగుతున్నా.. ఖర్చు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. పాలక మండలి ఉన్న సమయంలో అవిశ్వాసం మంటలతో నిధులు ఖర్చు చేయలేదు.. ప్రత్యేకాధికారుల పాలన వచ్చినా ఆ నిధులకు మోక్షం కలగలేదు. ఆరు నెలలుగా డిప్యూటీ సీఈఓ కుర్చీ ఖాళీగానే ఉంది. సీఈఓ సైతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో మండల పరిషత్‌ల పర్యవేక్షణ గాలీలో దీపంలా మారింది. కొంత కాలంగా జెడ్పీ పనితీరు అస్తవ్యస్తంగా మారడంతో విమర్శలకు తావిస్తోంది.
అసంపూర్తిగా జెడ్పీ భవనం
వికారాబాద్ ప్రత్యేక జిల్లాగా అవతరించాక జెడ్పీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మూడేళ్ల క్రితం పనులు చేపట్టారు. మూడు ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోర్ అందుబాటులోకి రావడంతో ఇటీవల ప్రారంభించారు. కానీ మండల పరిషత్ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పట్లో భవన నిర్మాణం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
నిధులున్నా ఖర్చు చేయని వైనం..
జిల్లా పరిషత్ ఖాతాలో రూ.2 కోట్లు ఉన్నా ఏడాది కాలంగా ఖర్చు చేయడంలేదు. పాలక మండలి ఉన్న సమయంలో అవిశ్వాస సేగలతో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూ నిధులు ఖర్చు చేయకుండా కాలం వెల్లదీశారు. ఇప్పుడు ప్రత్యేకాధికారుల పాలన వచ్చాక కూడా ఆ నిఽధులకు మోక్షం లభించలేదు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది. ఇప్పటికై నా అధికారులు అభివృద్ధి పనుల కోసం నిధులు ఖర్చు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment